ఒక మనిషి ఎలాంటి స్వార్థం లేకుండా పది మందికి ఉపయోగపడేలా సేవ చేయాలంటే ఎంత గొప్ప మనసు కావాలి?.. ఎలాంటి సొంత లాభం కోరుకోకుండా భగవంతుని సేవలోనే నిమగ్నం కావాలంటే ఎంత నిష్ఠ కావాలి?.. నాకేంటి..? నాకెంత..? అని ఆలోచించే ఇప్పటి సమాజంలో అలాంటివాళ్లు కూడా ఉన్నారంటే వాళ్లు నిజంగా దైవంతో సమానం. అలా ఉండాలన్నా, అలా బతకాలన్నా, చుట్టూ ఉన్నవాళ్లకు ఆదర్శంగా నిలబడాలన్నా అది అంత మామూలు విషయం కాదు. అలాంటి ఒక మహోన్నత వ్యక్తినే ఈ మధ్య నేను నా కళ్లారా చూశాను.. ఆశ్చర్యపోయాను.. మీతో పంచుకుంటున్నాను. కానీ, అంతకు ముందు అసలు ఇదంతా ఎలా మొదలైందో, ఏం జరిగిందో ఆ అనుభవాన్ని అక్షర రూపంలో ముందుగా మీకు చెప్తాను.
నేను ఈ మధ్య శ్రీశైలం వెళ్లి వచ్చాను.. శివరాత్రి సమయం కదా.. బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి.. చాలా బాగుంటుంది.. ఇలాంటి పవిత్ర సమయంలో ఆ శివయ్యను దర్శించుకోవచ్చని వెళ్లిన నాకు.. ఆ ట్రిప్‌లో భాగంగా అక్కడ అక్క మహాదేవి గుహలకు వెళ్లే అవకాశం దొరికింది. మీలో చాలా మందికి అక్క మహాదేవి గుహల గురించి తెలిసే ఉంటుంది. శ్రీశైలం వెళ్లినవారికి అయితే ఖచ్చితంగా తెలిసే ఉంటుందని అనుకుంటున్నా. ఈ గుహలు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ మధ్యలో విస్తరించి ఉన్న తూర్పు కనుమల మధ్య ఉన్నాయి. అక్కడికి వెళ్లాలంటే కృష్ణా నదిలో నుంచే వెళ్లాలి, వేరే దారి లేదు. చుట్టూ అంతా అడవి ప్రాంతం.. క్రూరమైన జంతువులు తిరిగే ప్రదేశం. కానీ, మనల్ని తీసుకెళ్లడానికి అక్కడ అన్నీ తెలిసిన గైడ్స్ ఉంటారు లెండి.. శ్రీశైలం నుంచి బోటులో తీసుకెళ్లి తిరిగి వాళ్లే తీసుకొస్తారు. నిజంగా చెప్పాలంటే ఈ గుహలను చూడడానికి వెళ్లడం కొంచెం సాహసంతో కూడుకున్న పని.. కానీ, ఒక అందమైన అనుభవాన్ని పొందాలంటే మాత్రం ఖచ్చితంగా వెళ్లి తీరాలి. సో.. అలా బోటులో వెళ్లి అక్కడ దిగగానే అసలు కథ మొదలైంది.బోటులో దాదాపు 25 మందితో కలిసి వెళ్లాం.. మధ్యలో కృష్ణా నది.. చుట్టూ పెద్ద పెద్ద కొండలు, గుట్టలు. సహజ సిద్ధంగా ఏర్పడిన రాతి ఆకృతులు, చాలా ప్రశాంతంగా, అందంగా ఉంది. కానీ, అడవి ప్రాంతం.. ఎక్కడ నుంచి ఏ పాము బుసలు కొడుతూ వస్తుందో, ఏ మూల నుంచి ఏ పులి వస్తుందో చెప్పలేం. అలా ఉంటుంది మరి ఆ ప్రదేశం.. అందరితో కలిసి గుంపుగానే వెళ్లాలి. అలా గుహలోకి ప్రవేశించగానే మొదట్లోనే నలుపు రంగులో ఉన్న అక్క మహాదేవి విగ్రహం మనకు కనిపిస్తుంది. అసలు అక్క మహాదేవి ఎవరు? ఎందుకు ఆవిడ పేరుతో గుహలు ఉన్నాయి? అనే సందేహాలు వచ్చే ఉంటాయి కదా.. చెప్తా... ఇది నిజంగా జరిగింది కాబట్టి కొంచెం వివరంగానే అర్థమయ్యేలా చెప్తా.. ఓపికతో చదవండి.
దాదాపు 800 ఏళ్ల క్రితం కర్ణాటక రాష్ట్రం శివమొగ్గ దగ్గరలోని ఉడుతడి అనే ఊరిలో మహాదేవి జన్మించింది. అయితే.. వాళ్ల తల్లిదండ్రులకు చాలా ఏళ్ల వరకు సంతానం లేకపోతే శ్రీశైలం శివయ్యని మొక్కుకున్నారట. వారికి కొడుకు పుట్టినా, కూతురు పుట్టినా నీ సేవకే అంకితం చేస్తామని. దీంతో మహాదేవి చిన్నప్పటి నుంచే శివ భక్తురాలిగా ఉండిపోయింది. శివుడే తన భర్త అని ఊహించుకుని పూజలు చేసేదట. అలా శివుడినే ఆరాధిస్తూ పెరిగి పెద్దదయింది. ఆ ప్రాంతాన్ని పాలించే రాజు కౌశికుడు మహాదేవి అందానికి దాసోహమై ఆమెను పెళ్లి చేసుకుంటానని మంత్రితో కబురు పంపాడట. ఇది తెలుసుకున్న ఆమె తల్లిదండ్రులు ఆ మంత్రితో.. తమ బిడ్డ పుట్టినప్పుడే శివుడికి అంకితం చేస్తామని మొక్కుకున్నాం, మహాదేవి కూడా చిన్నప్పటి నుంచి శివుడినే పూజిస్తుందని చెప్పారట. అయినా రాజు కావాలని కోరితే చేసేదేం లేదు కదా.. అందుకే మహాదేవి కొన్ని షరతులతో ఆ రాజుని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుందట. నేను ఎక్కువగా తపస్సు చేసుకుంటూ ఉంటాను, ఎందుకు అని అడగకూడదు.. దానధర్మాలు ఎక్కువగా చేస్తాను.. వద్దు అనకూడదు.. నా అనుమతి లేకుండా నన్ను తాకడానికి వీలు లేదు.. అలా అయితేనే పెళ్లి చేసుకుంటానని షరతులు పెట్టిందంట. దానికి రాజు ఇంత అందమైన అమ్మాయిని వదులుకోవడం ఇష్టం లేక ఆ షరతులకు ఒప్పుకుని పెళ్లి చేసుకున్నాడట. అయితే పెళ్లి జరిగిన చాలా రోజుల వరకు మహాదేవి తిండి, నీళ్లు కూడా లేకుండా ఎక్కువ సమయం ధ్యానం, తపస్సు చేస్తూనే ఉండేదట. షరతులు ఉన్నాయి కాబట్టి చాలా రోజుల వరకు రాజు ఆమెను ఏమీ అడగలేదు. అలా చూసి చూసి విసిగిపోయిన కౌశికుడు.. ధ్యానంలో ఉన్న మహాదేవి దగ్గరికి ఒకరోజు కోపంగా వెళ్లి ఆమెను తాకి, ఎన్ని రోజులు ఇలా ఉంటావు, పెళ్లి చేసుకున్నాక ఒక్కసారైనా నా కోరికలు తీర్చావా అసలు అని నిలదీశాడట. అప్పుడు మహాదేవి.. ఇన్ని రోజులు నేను తిండి, నీళ్లు లేకుండా ఉన్నాను, నా గురించి కాకుండా నా శరీరం గురించే మీ ఆలోచన అంతా అని తను కట్టుకున్న ఒక్కొక్క వస్త్రాన్ని తీసి రాజు మీదికి విసిరేసిందట. ఇక అక్కడ ఉండలేనని చెప్పి, తన పొడవైన జుట్టుతో శరీరాన్ని కప్పుకుని అలాగే నగ్నంగా అక్కడి నుంచి బయటికి వెళ్లిపోయింది. శ్రీశైలంలోని జ్యోతిర్లింగంలో ఐక్యం కావడం మంచిదని ఆమె గురువు ఆదేశించడంతో కర్ణాటక రాష్ట్రం నుంచి నగ్నంగానే పాదయాత్ర చేస్తూ శ్రీశైలం చేరుకుందట. ఆ తర్వాత జీవితాంతం మహాదేవి నగ్నంగానే బతికిందట. అందరూ అక్క అని పిలవడంతో ఆమె పేరు పోనుపోను అక్క మహాదేవిగా మారిపోయింది. సామాన్య మనుషులు ఎవరికీ కనబడకూడదని, ప్రశాంతంగా ధ్యానం చేసుకోవాలి కాబట్టి ఎవరూ ఉండని ప్రాంతం అని శ్రీశైలం ఆలయానికి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గుహలకు వచ్చి 12 ఏళ్లు తపస్సు చేసుకుందట. ఆ తర్వాత ఒకరోజు శివుడిలో ఐక్యం అయిందని, ఆమె చనిపోలేదని నమ్ముతారు. అందుకే ఈ గుహలకు అక్క మహాదేవి గుహలు అని పేరు వచ్చింది.
మహాదేవి తపస్సుకు మెచ్చిన శివుడు ఇక్కడే బండరాళ్ల మధ్యలో లింగాకారంలో వెలిశాడట. ఇప్పటికీ మనం ఆ శివలింగాన్ని ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు. కానీ, చాలా సన్నని దారిలో వెళ్లాల్సి ఉంటుంది. అంత లోపలికి వెళ్లి దర్శనం చేసుకోవడం కొంచెం కష్టంతో కూడుకున్న పని. చాలా జాగ్రత్తగా వెళ్లగలిగితేనే ఆ శివలింగాన్ని మనం దర్శనం చేసుకోగలం.
అసలు మహాదేవి.. ఒక స్త్రీ.. అందులోనూ వయసులో ఉన్నప్పుడు, అది కూడా నగ్నంగా అన్ని సంవత్సరాలు ఒంటరిగా ఈ గుహలో తపస్సు చేసుకుందని వింటుంటేనే ఒళ్లు జలదరించింది. ఏ ధైర్యంతో ఆమె అలా వచ్చేసి ఉంటుంది.. మంచి మంచి పట్టుచీరలు, నగలు.. సాధారణంగా ఆడవాళ్లకు ఇలాంటి ఆశలు ఉంటాయి. అవన్నీ వదిలేసి దేవుడి కోసమే జీవితాన్ని అంకితం చేసి అన్నేళ్లు తపస్సు చేసుకుందంటే ఎంత నమ్మకం ఉండాలి. అంత నిజమైన భక్తి ఇప్పటి కాలంలో ఎవరికైనా ఉంటుందా?.. అదిగో అక్కడికే వస్తున్నా. అక్క మహాదేవి చరిత్ర ఎన్నో ఏళ్ల ముందు జరిగింది.. అంత గొప్ప భక్తురాలు ఉండేదని తెలిసింది. సరే అది అలా పక్కన పెడితే.. మొదట్లో చెప్పాను కదా.. ఒక మనిషి ఎలాంటి స్వార్థం లేకుండా పది మందికి ఉపయోగపడేలా ఎలా సేవ చేస్తారు? భగవంతుని సేవలో నిమగ్నం అవుతారు అని.. ఇప్పుడు మీరు తెలుసుకోబోయేది ఆవిడ గురించే. అక్క మహాదేవి గుహలు చూద్దామని వెళ్లిన నాకు.. అక్కడ ఆమె విగ్రహాన్ని తుడిచి పూజ చేస్తూ ఒక మహిళ కనబడింది.. ఆమె పేరు గౌరమ్మ. ఆవిడను అక్కడ చూసి ఆమె గురించి తెలుసుకున్నాక నా మైండ్ బ్లాంక్ అయిపోయింది నిజంగా. ఇక్కడ కింద ఫోటోలో ఆమెను మీరు చూడొచ్చు.
గౌరమ్మ కర్ణాటకలోని రాయచూర్ ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చిందట. ఒకటి కాదు.. రెండు కాదు.. 24 ఏళ్లుగా ఆమె ఇక్కడే ఒంటరిగా ఉంటుందని గైడ్ చెప్పాడు. అప్పుడప్పుడు మాత్రం తన సొంత ఊరికి వెళ్లి మళ్లీ వచ్చేస్తుందట. చుట్టూ అడవి, మాట్లాడడానికి ఎవరూ ఉండరు.. ఇలా ట్రిప్ కోసం అప్పుడప్పుడూ వచ్చిపోయే మనలాంటి వాళ్లు తప్ప. రాత్రి, పగలూ.. ఎండ, వాన, చలి వీటన్నిటికీ తట్టుకుని.. అలాంటి ప్రాంతంలో చుట్టూ జంతువుల మధ్య ఒక్కతే ఉంటుంది. ఓ ఆడ మనిషి.. అది కూడా 24 ఏళ్లుగా. జంతువులు వస్తే భయం వేయదా అని అడిగితే.. అవి ఏమీ చేయవు, దగ్గరికి వచ్చి వాసన చూసి వెళ్లిపోతాయని చాలా తేలికగా చెప్పింది. అన్ని సౌకర్యాలు ఉండి, పర్సుల్లో డబ్బులు ఉండి, దర్జాగా ఆఫీసుకి వెళ్లి ఏసీలో కూర్చుని పని చేసి.. అంతా అయ్యాక చాలా కష్టపడిపోయాను అనుకునే మనలాంటి వాళ్లు ఆవిడను ఎలా అర్థం చేసుకోవాలి? ఏంటి ఆవిడకి అంత ధైర్యం.. అంత నమ్మకం.. అంత ఓపిక.. అంత భక్తి.. ఎప్పుడో 800 ఏళ్ల ముందు బతికిన అక్క మహాదేవిని మనం ప్రత్యక్షంగా చూడలేం.. ఆవిడ లాంటి గొప్ప భక్తురాలిని మాత్రం కళ్లారా చూశా.. అక్క మహాదేవి లాంటి భక్తురాలు ఒకప్పుడు ఉండేవారంటే.. దానికి ప్రత్యక్ష నిదర్శనం గౌరమ్మ.
అక్కడ నేను ఒక రెండు గంటల వరకూ ఉన్నా.. అక్క మహాదేవి విగ్రహాన్ని తుడవడం, పూజ చేయడం, వచ్చినవారికి తీర్థం, ప్రసాదం ఇవ్వడం.. ఇదే ఆవిడ పని. ఆ మనిషిలో ఏ స్వార్థం లేదు.. దేని మీద ఆశ లేదు.. అక్కడ అలా చేస్తే ఏదో డబ్బులు వస్తాయేమో అనే కోరిక లేదు.. మరి ఏం ఆశించి ఆవిడ అన్నేళ్లుగా అక్కడ ఉంటుందంటారూ..? ఏ ప్రతిఫలం ఆశించని స్వచ్ఛమైన మనసు ఆవిడది. ఏ రాగద్వేషాలు లేని నిర్మలమైన శరీరం గౌరమ్మది. నిజంగా అద్భుతం అనిపించింది. దేవుళ్లు ఎక్కడో ఉండరు.. ఇలా మనుషుల రూపంలో అక్కడక్కడా మనకు కనబడతారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి