మీకు పుస్తకాలు, నవలలు చదివే అలవాటు ఉందా? అబ్బే.. ఈ కాలంలో కూడా చదవడాలు ఏంటయ్యా బాబూ..! యూట్యూబ్, రీల్స్, ట్విట్టర్ అంటూ సోషల్ మీడియా పరుగులు పెడుతుంటే.. అంటారా? అవుననుకోండి.. కానీ, చేతిలో ఒక మంచి పుస్తకం పట్టుకుని, ఒక్కో అక్షరాన్ని ఆస్వాదిస్తూ, పక్కన పరిసరాలను కూడా మర్చిపోయి లీనమై చదవడంలో ఉన్న ఆనందం.. బటన్ నొక్కి ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల్లో చదివే ఈ ఆన్‌లైన్ ప్రపంచంలో ఖచ్చితంగా లేదు. అయితే టెక్నాలజీ పరుగులు పెడుతున్న ఇప్పటి కాలంలో కూడా ఒక పుస్తకం జనాలకు బాగా దగ్గరైందంటే నమ్ముతారా?.. ముఖ్యంగా యూత్‌కి పిచ్చిపిచ్చిగా నచ్చేసింది. ఏంటీ.. ఇప్పటి పిల్లలు కూడా ఇలా ఇంత ఇష్టంగా పుస్తకాలు చదువుతారా అని ఆశ్చర్యపోయేలా చేసింది. ఇప్పుడు ఎక్కడ చూసినా ఆ బుక్ గురించే టాపిక్.. ఆ బుక్ చదివాక నాకు కూడా ఓ మంచి అనుభూతి కలిగింది.. సింపుల్‌గా చెప్పాలంటే బాపు గారి సినిమా చూసినంత అందంగా.. పచ్చని పంట పొలాల మధ్య సేద తీరుతున్నంత ఉల్లాసంగా.. బాల్కనీలో కూర్చుని అలా కాఫీ తాగుతూ బయట ప్రపంచాన్ని చూస్తున్నంత ఆనందంగా.. మరీ ముఖ్యంగా అమ్మ ఒడిలో పడుకుని తన అనుభవాలు చెప్తుంటే విన్నంత ప్రేమగా.. అనిపించింది అది చదివితే. ఆ పుస్తకమే..'అమ్మ డైరీలో కొన్ని పేజీలు'.
బహుశా.. ఈ బుక్ గురించి మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది. చాలా మంది చదివేసి కూడా ఉంటారు. మామూలుగానే పుస్తకాలు చదవడం, రాయడం ఇంట్రెస్ట్ ఉన్న నాకు కూడా ఈ బుక్ చదవాలనే కోరిక సహజంగానే ఏర్పడింది. చదివాక దీని గురించి పది మందితో ఇలా పంచుకోవాలి అనిపించింది. పుస్తకం మొత్తం గురించి చెప్పడానికి ఇక్కడ కుదరదు కాబట్టి.. ఉన్న పరిధిలోనే అందులో నుంచి కొన్ని నాకు బాగా నచ్చినవాటి గురించి కొద్దిగా మీతో పంచుకుంటాను. అంతకంటే ముందుగా ఈ పుస్తకాన్ని ఇంత అద్భుతంగా రాసి, మనం మనసు పెట్టి చదివేలా చేసిన రచయిత రవి మంత్రి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
'ఒకరిని చూడాలి అనిపించడం..వారిని చూడడం కన్నా బలమైన భావన'.. ఎంత బాగుంది కదా లైన్. నిజంగా మీరు ఎవరినైనా మిస్ అవుతున్నారా? అప్పుడు దీనికి అర్థం నేను మళ్లీ కొత్తగా విడమర్చి చెప్పాల్సిన అవసరం లేదు. నచ్చిన మనిషి మన పక్కన ఉంటే మనం ఎంత ఆనందంగా ఉంటామో.. వాళ్లు దూరంగా ఉంటే అంతకన్నా ఎక్కువ బాధ పడిపోతాం. ఆ మనిషిని వెంటనే చూడాలి అనిపిస్తుంది.. ప్రేమగా తాకాలని అనిపిస్తుంది. వాళ్లను ఎదురుగా మీ కళ్లతో చూడడం కన్నా, చూడాలి అనే మీ కోరికే మరింత బలమైనది అంట. రచయిత గారు మన మనసుల్ని చదివేసినట్లు ఉన్నారు.
'ఎన్నో నిద్ర లేని రాత్రులు. కొన్ని అమావాస్యవి, మిగతావన్నీ వెన్నెలవి'.. హహ్హ.. నచ్చిన మనిషి దూరంగా ఉంటే ఆ రాత్రులు అమావాస్య అంట, దగ్గరగా ఉంటే పౌర్ణమి అంట. ఆ మనిషి లేకపోతే నిద్ర కూడా పట్టదు అంట. నిజమే కదా.. కానీ, ఏవైనా నావే అన్నారు మళ్లీ. ఎందుకంటే ఇష్టమైన మనిషి ఆనందం ఇచ్చినా, బాధని ఇచ్చినా మనం సంతోషంగానే స్వీకరిస్తాం. వాళ్ల మీద మనకు ఉండే ప్రేమ, అభిమానం అలాంటివి. ఇక్కడ ఇచ్చిన ఆ పేరా చదవండి.. మీకే అర్థం అవుతుంది. మనిషిలోని అందమైన ప్రేమ భావాలను ఎంత కవితాత్మకంగా వర్ణించారో.
ఇష్టమైన వ్యక్తి అక్షరాల్లో కనిపిస్తున్నాడంట.. ఒక మనిషిని గురించి ఆలోచనలు మనసంతా నిండిపోయి ఉంటే ఉత్తరంలో ఏంటి?.. ఎటు చూసినా వాళ్లే కనిపిస్తారు. అలాంటి అనుభూతి మీరు ఎప్పుడైనా పొందారా?.. నేను పొందాను. కానీ, ఇప్పుడు మన జనరేషన్ అంతా వాట్సాప్ మెసేజుల్లో చూసుకుంటున్నారేమో..! అంతే తేడా.. చూసే పద్దతి మారినా.. మనసులో పెంచుకునే ప్రేమ మాత్రం అప్పటికీ, ఇప్పటికీ ఒకటే.
ప్రేమ అంటే ఒకేసారి అవుతుంది.. తర్వాత ఎన్ని వచ్చినా సర్దుబాట్లే. అవును.. నేనైతే నిజమే అంటాను. మొదటి ప్రేమ, రెండో ప్రేమ లాంటివి ఖచ్చితంగా ఉండవు. ప్రేమ అంటే ఒకే ఆలోచనలు ఉన్న రెండు మనసులు ఒకటవ్వడం. కానీ, ఒకేలా ఆలోచిస్తే సర్దుబాట్ల కన్నా గొడవలే ఎక్కువ అవుతాయేమో. అర్థం చేసుకోవడంలోనే ఉంటుంది ఏదైనా. బంధం అనే కంటికి కనిపించని దారాలతో ఎప్పుడో మనం ముడిపడిపోయామని ఈ కథలో చెప్తున్నారు. అలా అని ఆ బంధం విడిపోతే ఆ మనిషి మనకు కాకుండా పోతాడా..? నాకు తెలిసి ఆ మనిషిని నిజంగా ఇష్టపడితే ఆ బంధం ఉన్నా, తెగిపోయినా చచ్చేవరకు ఆ మనిషి నీ మనసులోనే ఉంటారు. మనం ఒక చిన్న ఉదాహరణ చూద్దాం ఇక్కడ. నవమోసాలు మోసి ఓ తల్లి బిడ్డను కంటున్నప్పుడు.. ఆ ఇద్దరికీ ముడిపడిన ఒక పేగుని కత్తిరించి వాళ్లను వేరు చేస్తారు. అంత మాత్రాన ఆ బంధం విడిపోయినట్లా.. కాదు కదా. ఆ రోజు నుంచి ఆ తల్లికి ఆ బిడ్డే లోకం. అందుకే కొన్నిసార్లు విడిపోయినా కూడా బంధం విలువ మరింత ధృడపడుతుందని నేను నమ్ముతాను.
సినిమాల్లో అసభ్యత పెరిగిపోయిన ఈ రోజుల్లో ఒక అందమైన శృంగార భావనను ఇంత అందంగా వివరించడం ఇప్పుడే చదువుతున్నా. ఒకరినొకరు గాఢంగా ఇష్టపడిన రెండు మనసుల మధ్య జరిగే శారీరక సుఖంలో కూడా ప్రేమ దాగి ఉంటుందని భలే చక్కగా చెప్పారు. శృంగారం అంటే బూతు మాత్రమే కాదు.. ఇద్దరు మనుషులు ఒకరినొకరు అర్థం చేసుకుని, ఆ రెండు మనసులను ఒక్కటిగా చేసుకుని, వారి శరీరాలు జరిపే పవిత్ర కార్యం. ఆగకుండా కురుస్తున్న వర్షం తడిసిన నేలని మళ్లీ మళ్లీ ముద్దాడుతుందట. ఆలోచనల్లో ఎంత స్వచ్ఛమైన భావన ఉంటే ఇలా వర్ణిస్తారు నిజంగా.. అద్భుతం.
ఇవే కాదు.. ఇంకా చాలా ఉన్నాయి ఇలాంటి అందమైన రాతలు ఈ పుస్తకంలో. కానీ, అవి మీకు మీరుగా సొంతంగా చదివితే కలిగే అనుభూతి వేరే ఎవ్వరూ ఇవ్వలేరు. అందుకే వీలైతే మీరూ చదవండి.. ఒకవేళ చదివి ఉంటే ఎలా ఫీల్ అయ్యారో నాకు కామెంట్ ద్వారా చెప్పండి. నాకు మాత్రం ఎన్నో ఏళ్లయింది.. ఇలాంటి ఒక మంచి కథ చదివి. అందుకే మీతో ఇలా పంచుకోవాలి అనిపించి ఇలా రాశా. ఇది నిజంగా చదివినట్లు కాదు.. అమ్మ నా పక్కనే కూర్చుని తన కథంతా చెప్పినంత అందంగా ఉంది. అమ్మ ప్రేమంత స్వచ్ఛంగా ఉంది. రవి మంత్రి గారూ.. మీకు మరొక్కసారి హ్యాట్సాఫ్ అండీ...!
THANK YOU
SUPPORT & IDEA: CH.VAMSI MOHAN
PC & HELP: PRANAY VIJIGIRI
కామెంట్‌లు
Ee book lo Padi Padi chadeventha kotthadham emi leedhu oka sari chadhavochu, Paatha Navals lo akkadakkada koncham koncham techi, oka chota cherchinattu unnayi carrocters. Social media ni baaga use chesukunnadu writer andhuke click ayyendhe. Antha kotthadhanam emi leedhu
రిప్లయితొలగించండిok andi.. Thank you
తొలగించండి