'షిర్డీ'కి నా ప్రయాణం

ఎప్పటి నుంచో అనుకుంటున్నా.. షిర్డీ వెళ్లి రావాలని. చిన్నప్పుడు ఓసారి అవకాశం వచ్చినా ఎందుకో వెళ్లడం కుదరలేదు. అయితే ఇన్నేళ్ల తర్వాత ఆ అవకాశం మళ్లీ వచ్చింది. ఈ సారి ఎలాగైనా వెళ్లాలని.. ఆ పుణ్యక్షేత్రంలో ఉన్న సాయినాథుడిని దర్శించుకోవాలని అనుకున్నా. పైగా విపరీతంగా వర్షాలు కురుస్తున్న జులై నెల అది. వెళ్లాక ఈ వర్షాలకు ఏమైనా ఇబ్బంది పడతానా? అనుకున్నట్లుగా అన్నీ చూడడం కుదురుతుందా? అనే సందేహాలు. ఏదైతే అది అయింది. వచ్చిన అవకాశం వదులుకోకూడదని గట్టిగా నిర్ణయించుకున్నా. ట్రైన్ టిక్కెట్లు, వెళ్లాక ఉండడానికి రూమ్ మిగతా ఏర్పాట్లు అన్నీ పూర్తి చేసుకున్నా. జులై 25, 2024 గురువారం సాయంత్రం ప్రయాణం మొదలుపెట్టా.'షిర్డీ'కి నా ప్రయాణంశుక్రవారం ఉదయం 8 గంటల సమయంలో నాగర్‌సోల్ రైల్వే స్టేషన్‌లో దిగా. అక్కడి నుంచి షిర్డీకి సుమారు 40 నిమిషాల ప్రయాణం. వెళ్లడానికి కార్లు, జీపులు, క్యాబ్స్ లాంటివి ఉంటాయి. ట్రైన్ దిగీ దిగగానే మన కన్నా ముందు ఆ క్యాబ్స్ వాళ్లు హడావిడి చేస్తుంటారు. బేరం మాట్లాడుకోవడానికి.. కానీ, ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మొదటిసారి వెళ్తున్నవాళ్లు ఎవరైనా ఆ రేటూ అదీ తెలుసుకుని వెళ్లడం మంచిది. లేదంటే, మనం కొత్త కదా అని వాళ్ల ఇష్టానికి బేరం మాట్లాడి మోసం చేసే అవకాశం ఉంది. మీరు మొదటిసారి వెళ్తున్నట్లయితే జాగ్రత్త మరి..! నాకు కూడా ఈ ప్రాసెస్ అంతా పూర్తవడానికి అటుఇటుగా అరగంట పట్టింది. అప్పటికే ప్రయాణం చేసి అలసిపోయి ఉన్నా.. కాసేపటి తర్వాత నేను ఎక్కిన క్యాబ్ షిర్డీ వైపు కదిలింది.'షిర్డీ'కి నా ప్రయాణంవర్షాలు పడుతున్న రోజులు కదా.. చల్లగా ఉంది వాతావరణం. క్యాబ్‌లో వెళ్తుంటే మంచి గాలి తగులుతూ హాయిగా అనిపించింది. మహారాష్ట్ర వైపు వెళ్లడం నేను ఇదే మొదటిసారి. మధ్యలో ఏవేవో ఊళ్లు దాటుకుంటూ బండి ముందుకు వెళ్తుంది. దారికి రెండు పక్కలా బోర్డులు, షాపుల పేర్లు అన్నీ హిందీలో రాసి ఉన్నాయి. అన్నట్లు మనకూ అంతో ఇంతో కొంచెం హిందీ వచ్చులెండి.. పైగా చాలావరకు సాయి అనే పేరు వచ్చేలా ఉన్న బోర్డులే కనిపించాయి. దారిలో చాలా గుడులు కనబడ్డాయి. ముఖ్యంగా గమనించింది ఏంటంటే.. అన్ని గుళ్లకు గోపురాలు మన వైపులాగా కాకుండా వేరే ఆకృతిలో కొత్తగా ఉన్నాయి. అలా చూసుకుంటూ వెళ్తున్న మా క్యాబ్ మొత్తానికి షిర్డీ చేరుకుంది. ప్రధాన ఆలయ ప్రాంతం నుంచే క్యాబ్ వెళ్లడంతో ఆ పరిసరాలు అవీ గమనిస్తూ వెళ్తున్న నాకు.. కమలం పువ్వు ఆకారంలో నిలబడి కుండలో నుంచి నీళ్లు పోస్తున్నట్లు ఉన్న సాయిబాబా నిలువెత్తు విగ్రహం ఒకటి ముందుగా ఆకర్షించింది.'షిర్డీ'కి నా ప్రయాణంశ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తున్న రూమ్ ముందే ఆన్‌లైన్‌ బుకింగ్ చేసుకోవడంతో క్యాబ్ వాళ్లను డైరెక్ట్ అక్కడికే తీసుకెళ్లమని చెప్పాం. వసతి భవనాలు, ఆ పరిసరాలు చాలా బాగున్నాయి. ఎక్కడ చూసినా శుభ్రంగా, పచ్చదనం కనిపించింది. ముఖ్యంగా ట్రస్ట్ వాళ్లు క్రమశిక్షణతో అంత బాగా దాన్ని నడిపిస్తుండడం, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవడం మెచ్చుకోగదగిన విషయమే. నేను మొదటిసారి షిర్డీ రావడం వల్లనేమో.. ఆ సౌకర్యాలు అవీ చాలా బాగా అనిపించాయి. రూమ్‌కి వెళ్లి, స్నానాలు అవీ చేసి దర్శనానికి వెళ్లడమే ఇక మిగిలింది. అనుకున్నట్లుగానే తొందరగానే రెడీ అయిపోయి సర్వదర్శనం వెళ్లాల్సిన క్యూ లైన్‌లోకి చేరుకున్నా. అక్కడి నుంచి కంపార్టుమెంటులాగా ఉన్న ఒక గదిలో కాసేపు కూర్చోబెట్టారు. అక్కడ వేచి ఉన్న భక్తులకు టీ, పాలు లాంటివి అందిస్తున్నారు. అది చూడగానే నాకు ఎందుకో ఒక్కసారిగా తిరుమల గుర్తొచ్చింది.'షిర్డీ'కి నా ప్రయాణంచాలా రోజుల నుంచి అనుకున్నా కదా.. ఇలా రావాలని. అక్కడ కూర్చున్నంత సేపు ఎప్పుడెప్పుడు ముందుకు పంపిస్తారా.. దర్శనం ఎప్పుడు చేసుకుంటానా అని చాలా ఆసక్తిగా అనిపించింది. భక్తులు లైన్లలో ఉండి 'సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్‌కి జై' అంటూ ముందుకు కదులుతున్నారు. ఎక్కువగా హిందీ, మరాఠీ వాళ్లు కనిపించగా.. అక్కడక్కడా కొందరు తెలుగు మాట్లాడేవాళ్లని కూడా చూడడం బాగా అనిపించింది. సాయిబాబా ఎక్కడ పుట్టాడో ఇప్పటికీ ఖచ్చితంగా ఎవరికీ తెలియదని అంటారు. అలాంటి ఒక మనిషి షిర్డీ అనే ప్రాంతానికి వచ్చి, ఇక్కడ మనుషుల్లో కదలిక తెచ్చి, ఈ రోజుకీ అందరూ దేవుడిలా భావించి మొక్కుతున్నారంటే అది గొప్ప విషయమే. ఒక మనిషి పది మందికి ఆదర్శంగా నిలిచాడంటే అది ఊరికే జరగదు. ఆ మనిషి తత్వంలో ముందు ఆదర్శ భావాలు ఉండాలి.. ఆ భావాలు పది మందిని మార్చేలా ఉండాలి.. ఆ బాటలో నడిచేలా ముందుకు నడిపించాలి. హిందూ, ముస్లిం అనే మతబేధాలు లేకుండా మనుషుల్లో ప్రేమ, కరుణ, దాన గుణాలు ఉండాలని చెప్పడమే సాయితత్త్వం అని తెలుసుకున్నా.'షిర్డీ'కి నా ప్రయాణంసాయిబాబా నడిచిన నేల, నివసించిన చోటు, స్వయంగా ఆయన నాటిన చెట్టు ఇప్పటికీ మనకు షిర్డీలో కనిపిస్తాయి. బాబా వెలిగించిన ధుని ఇప్పటికీ మండుతూ ఉంటుందట. ఆ ధునిలోని భస్మాన్నే మనకు ఊదిలా అందిస్తారు. ఆ ఊది చాలా పవిత్రమైనదని, ఇంటికి తెచ్చుకుంటే మంచిదని అందరూ అంటారు. సాయి అప్పట్లో నివసించిన మసీదుని ఇప్పుడు 'ద్వారకామాయి' అని పిలుస్తారు. బాబా రోజూ ఆ స్థలంలోనే ఎక్కువ సమయం గడిపేవారట. అందుకే ద్వారకామాయిని అంత గొప్పగా భావిస్తారు. ఇలా ఎన్నో విషయాలు తెలుసుకుంటూ, వాటిని దర్శిస్తూ నడుస్తున్న నేను మొత్తానికి బాబా మందిరానికి చేరుకున్నా.'షిర్డీ'కి నా ప్రయాణంగురుపీఠంపై కూర్చుని, ఒక కాలిని మరో కాలిపై ఉంచుకుని, భక్తులను కరుణ నిండిన చూపులతో చూస్తున్న దివ్య మంగళ స్వరూపాన్ని దర్శించుకున్నాను. ఆ పాలరాతి విగ్రహం ముందరే కింద శాశ్వత నిద్రలో ఉన్న బాబా పవిత్ర సమాధిని భక్తితో మొక్కాను. బాబా రూపంలోనే ఒక జీవిత సత్యం దాగి ఉందేమో కదా. ఒంటిపై ధరించిన అక్కడక్కడా చిరిగిన బట్ట, నెరిసిన గడ్డం, తలకు తెల్లని వస్త్రంతో ముడి వేసుకుని ఓ మామూలు ఫకీరులా కనిపించే ఆయన.. ఆడంబరాలు, ఆర్భాటాలు జీవితంలో శాశ్వతం కావని చెప్పడమే దాని అర్థం అని నాకు అనిపిస్తుంది. సామాన్యుడి నుంచి ధనవంతుడు వరకు ఎంతటివాడైనా అదే లైనులో వెళ్లి దర్శనం చేసుకోవడం వెనక.. అక్కడ ఎవరైనా సమానమే అనే తత్త్వం బోధపడుతుంది. ఆ సమాధి ప్రాంతంలో ఉన్నంత కాసేపు మనసుకు, శరీరానికి చాలా ప్రశాంతత దొరికింది. జీవితంలో పడే కష్టాలు, బాధలు, భయాలు అన్నీ అక్కడే విడిచిపెట్టి నన్ను నమ్మితే నేను చూసుకుంటాలే అన్నట్లు బాబా తోడుగా ఉండి ధైర్యం చెప్పినట్లు తోచింది. కాలు ముందుకు కదిపి ఒక్కో అడుగు వేస్తున్న కొద్దీ బాబా భుజంపై చేయి వేసి నాతో ముందుకు నడిచినట్లుగా బయటకు చెప్పలేని అనుభూతి. దర్శనం పూర్తయి తిరిగి వెళ్తున్న నేను వెనక్కి తిరిగి ఆ మూర్తిని చూసిన ప్రతిసారి.. నీ వెంటే వస్తున్నా పదా అని బాబా చెప్తున్నట్లు ఆ దైవత్వం మనసులో దివ్యంగా నిలిచిపోయింది.'షిర్డీ'కి నా ప్రయాణం


THANK YOU

PC: CH. VAMSI MOHAN


కామెంట్‌లు