స్వాతంత్య్ర దినోత్సవం వచ్చేసింది. దేశం బానిస సంకెళ్లు తెంచుకుని, పరాయి పాలన నుంచి విముక్తి పొంది 78వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోనుంది. ఎంతో మంది పోరాటయోధుల త్యాగాల ఫలితంగా ఏర్పడిన స్వతంత్రం.. ఇప్పుడు వాట్సాప్ స్టేటస్‌ల్లో మాత్రమే కనిపిస్తోంది లేదా టీవీలో 'ఖడ్గం' సినిమా వేస్తే అది చూసి పొంగిపోయి దేశభక్తి మనలో కూడా ఉందని గుర్తు చేసుకుంటున్నాం. ఇలా ఆలోచిస్తుంటే నాకు ఒకటి గుర్తొచ్చింది. ఇప్పుడంటే పిల్లలకు అంతా కార్పొరేట్ కల్చర్.. ఏదో వెళ్లామా వచ్చామా అన్నట్లు ఉంది.. మరి నా చిన్నప్పుడు స్కూల్లో ఎలాంటి అనుభవాలు ఉండేవో ఒక్కసారిగా గిర్రున బుర్రలో తిరిగాయి.ఆగస్టు 15 వస్తుందంటే.. దానికి వారం ముందు నుంచే ఏర్పాట్లు మొదలైపోయేవి. ముందుగా ఆటల పోటీలు.. కబడ్డీ, ఖోఖో, రన్నింగ్, చెంచా గోలీ, స్కిప్పింగ్.. అబ్బో ఇలా ఒక్కటేమిటి? ఎన్నో ఆటలు ఆడుకునేవాళ్లం. ఒక్కో ఆటకు టీమ్‌లు డివైడ్ చేసి టీచర్స్ ఆటలు ఆడించేవాళ్లు. ఆ నాలుగు రోజులు ఇక పుస్తకాలు ముట్టేదే లేదు. కొన్నిసార్లు ఆడుతూ దెబ్బలు కూడా తగిలేవి. అయినా తగ్గేదేలే.. ఆ సరదాలో అదేం పెద్ద బాధ అనిపించేది కాదు. పోటీల్లో గెలిస్తే గొప్పగా ఫీల్ అయిపోతూ.. 15వ తేదీ నాడు జెండా ఎగిరేశాక ఇచ్చే గిఫ్ట్ కోసం ఎదురుచూసేవాళ్లం.
*****
జెండా పండుగకు ఒక్క రోజు ముందు ఏ క్లాసు వాళ్లు ఆ క్లాసు గదిని శుభ్రం చేసుకోవాలి. ఫ్రెండ్స్ అందరం కలిసి కింద అంతా ఊడ్చేసి, నీళ్లు చల్లి కడిగేసేవాళ్లం. అమ్మాయిలేమో రంగురంగుల చాక్‌పీస్ ముక్కలతో పెద్ద పెద్ద ముగ్గులు వేసేవాళ్లు. ఇక గదిలో పైన దూలాలు ఉండేవి కదా.. వాటికి జెండా రంగులు వచ్చేలా కాగితాలు అతికించేవాళ్లం. అలా అతికించడానికి ఫెవికాల్ గమ్ లాంటిది పెట్టడం అప్పట్లో మాకు తెలియదు. మైదాపిండిని ఉడికించి జిగురులాగా తయారుచేసేవాళ్లు. దాన్ని మేము 'లై' అని పిలిచేవాళ్లం. ఇప్పట్లో వాళ్లకి అసలు దీని పేరు కూడా తెలియకపోవచ్చు బహుశా.
*****
ఇక అదే రోజు రాత్రి ఎన్ని పనులో మాకు.. తెల్లారితే ఆగస్టు 15. పొద్దున్నే లేచి స్కూలుకు వెళ్లిపోవాలి. దానికి కావాల్సిన ఏర్పాట్లు చేసుకోవాలి. అమ్మ స్కూల్ యూనిఫామ్ మంచిగా ఉతికిపెట్టేది. అది ఆరిపోయాక నీట్‌గా ఐరన్ చేసుకునేవాళ్లం.. లేదంటే కొత్త యూనిఫామ్ కొనాలి. ఆ ఐరన్ నలగకుండా అలాగే ఉండాలని ఎన్ని జాగ్రత్తలు పడేవాళ్లమో.. ఆ కష్టం మాకు మాత్రమే తెలుసు. ఇక బెల్ట్, టై, దానిపైన స్కూల్ లోగోతో బ్యాడ్జి, బ్లాక్ కలర్ షూ, దానికి ఉతికేసిన వైట్ సాక్స్.. ఇవన్నీ అప్పటికప్పుడు చేసుకోవాల్సిందే. ఇక అమ్మాయిలు అయితే చెప్పేదే లేదు . చేతి నిండా గోరింటాకు పెట్టుకుని, నెయిల్ పాలిష్ వేసుకుని ఎంత చక్కగా రెడీ అయ్యేవారో. రెండు జడలు వేసుకుని రిబ్బన్లు కట్టుకుని, మళ్లీ వాటికి మల్లెపూలు. ఇవన్నీ సిద్ధం చేసుకుని ఎప్పుడు తెల్లారుతుందా అని పడుకునేవాళ్లం. కొన్నిసార్లు నిద్ర కూడా పట్టేది కాదు అనుకోండి.పొద్దున్నే లేచామా.. హడావిడిగా స్నానం చేసేసి రాగానే అమ్మ తలకు బాగా నూనె పెట్టేసి, దువ్వేది. అప్పట్లో అమ్మ దువ్వే ఆ హెయిర్ స్టైల్ వేరే లెవల్ అనుకో. తర్వాత యూనిఫామ్ తొడుక్కుని బెల్ట్, షూ ఇవన్నీ వేసుకునేలోపు ఇంకా పూర్తిగా తెల్లారేది కూడా కాదు. రోజూ పొద్దున్నే లేచి ఇంటి పనులు చేసుకునే అమ్మ.. ఆ ఒక్కరోజు మాత్రం అన్నీ పక్కనపెట్టేసి మనల్ని రెడీ చేసే పనిలోనే ఉండేది. ఇలా రెడీ అవుతున్నామో లేదో ఫ్రెండ్ గాడు ఇంటికి వచ్చేసి.. 'ఏరా.. నేను రెడీ.. నువ్వు ఇంకా అవ్వలేదా' అని తొందరపెట్టేసేవాడు. ఇదిగో అయిపోయిందిరా నాది కూడా.. వెళ్దాం.. వాడిని కూడా పిలువు పోదాం అని. రోజూ కన్నా ఆ రోజు స్కూలుకు కొంచెం అందంగా రెడీ అవుతాం కదా.. అమ్మ మనల్ని చూసి మురిసిపోతూ దగ్గరికి తీసుకుని చెంప మీద ముద్దు పెట్టి పంపించేది.
*****
కొత్త యూనిఫామ్‌తో ఇంటి నుంచి బయటికి వెళ్లామా.. రోడ్డు మీద అందరూ మనల్ని చూడడమే. కొన్నిసార్లు వాళ్లు చూడకపోయినా చూసినట్లు మనమే ఫీల్ అయిపోయేవాళ్లం. స్కూల్‌కి చేరుకోగానే అక్కడ అందరూ మనలాగే యూనిఫామ్‌లు వేసుకుని చక్కగా వచ్చేసేవాళ్లు. అందర్నీ ఒక్కసారి ఒకేచోట అలా చూస్తుంటే చాలా బాగుండేది. అప్పటికే స్కూల్ గ్రౌండ్‌లో ఒక దగ్గర కుర్చీలో గాంధీతాత ఫోటో.. వెనక ఎగరేయాల్సిన జెండా కర్రకు కట్టి సిద్ధంగా ఉండేది. మనకు బాగా క్లోజ్‌గా ఉండే ఫ్రెండ్ చేయి పట్టుకుని ఇద్దరు ఇద్దరుగా ర్యాలీకి వెళ్లేవాళ్లం. ఊరంతా ర్యాలీ తీస్తుంటే స్కూల్ పిల్లలు అందరూ భలే ఉన్నారని రోడ్ల మీద జనం బయటికి వచ్చి చూసేవాళ్లు. అన్నిటి కన్నా ముఖ్యంగా మన ఇంటి దగ్గర వరకు ర్యాలీ చేరుకుందా.. మనసులో ఒక తెలియని బెరుకు మొదలయ్యేది. మనని చూసి ఇంటి బయట నిలబడిన అమ్మానాన్న అపురూపంగా చూస్తుంటే వచ్చీరాని నవ్వుతో వాళ్లను చూస్తూ తల దించుకుని వెళ్లేది. ఇక అంతే.. వెనక ఉన్న ఫ్రెండ్ మనల్ని ముందుకు తోస్తూ రేయ్ చూడరా.. మీ ఇంటివాళ్లు ఉన్నారని చెప్తుంటే ఇంకా బిడియం ఎక్కువైపోయేది.
*****
తిరిగి స్కూల్ చేరుకోగానే అసలు ప్రోగ్రాం స్టార్ట్ అయ్యేది. హెడ్ మాస్టర్ ముందుగా గాంధీ ఫోటోకి బొట్టు పెట్టి, పూలమాల వేసి దండం పెట్టేవాడు. తర్వాత జాతీయ జెండా ఎగరేస్తుంటే.. అందరం లేచి నిలబడి 'జనగణమన' పాడుతుంటే నరనరాల్లో దేశభక్తి పొంగిన ఫీలింగ్ వచ్చేసేది. హెడ్ మాస్టర్ ఆ తర్వాత మిగతా టీచర్స్ ప్రసంగం మొదలుపెట్టగానే ఎప్పుడెప్పుడు అయిపోతుందా అని ఆ వయసులో చిరాకుతో ఎదురుచూసేది. కొందరు స్టూడెంట్స్ కూడా ఉపన్యాసాలు ఇచ్చేవాళ్లు.. నేను కూడా ప్రతి ఏడాది మాట్లాడేది.. అది వేరే విషయం అనుకోండి. ఆ తర్వాత కల్చరల్ ప్రోగ్రామ్స్.. ఇది స్టార్ట్ అవ్వగానే అప్పటివరకు ఉన్న నిద్రమత్తు వదిలిపోయేది. దేశభక్తి పాటలకు డాన్సులు, స్వాతంత్య్ర సమరయోధుల వేషాలు వేసుకుని వేసే నాటికలు.. అబ్బో ఇవన్నీ అప్పట్లో తెగ ఎంజాయ్‌మెంట్.ఆటలు, వ్యాసరచన, మిగతా పోటీల్లో గెలిచినవాళ్లకు బహుమతుల ప్రదానం.. ఇప్పుడంటే షీల్డులు, మొమెంటోలు వచ్చాయేమో కానీ.. మాకు ఏం ఇచ్చేవాళ్లు తెలుసా? స్టీలు గిన్నెలు, గ్లాసులు.. అవే మాకు అపురూపం. అవి ఇంటికి తీసుకెళ్లి గెలిచామని అమ్మానాన్నకు చూపించి తెగ మురిసిపోయేది. ఎప్పుడైనా ఇంట్లో వాడుతూ ఆ గ్లాసులో టీ తాగినప్పుడు ఇది నాకు వచ్చిన బహుమతి అని పొందే ఆ సంతోషమే వేరు. ఇప్పుడు ఎక్కడ అలాంటి ఆనందం..? ఎక్కడ ఆ ఆరాటం..? ఇది మన స్కూలు, మన జెండా పండగ అని సొంతంగా ఫీల్ అయ్యేంత ప్రేమ ఎక్కడ?. ఏది ఏమైనా.. స్వాతంత్య్రం వచ్చి ఎన్నేళ్లు అయినా.. ప్రతి మనిషిలో దేశభక్తి మాత్రం మనసుల్లో నిజంగా ఉంటే అదే చాలు.
Super 👍, patriotic & nostalgic
రిప్లయితొలగించండిThanks 🙏
రిప్లయితొలగించండిBaga rasavu bro
రిప్లయితొలగించండిThanks 🙏
తొలగించండి