'మీనాక్షి'.. నాకెంతో ఇష్టమైన పాత్ర

'అర్థం చేసుకోరూ..!' అంటూ ఇంతింత పెద్ద కళ్లని చక్రాల్లా తిప్పుతూ.. ఒక చిన్న నిట్టూర్పుతో మూతిని వంకరగా తిప్పుతున్నప్పుడు చూడాలి మీనాక్షిని. చిన్నపిల్ల లాంటి మనస్తత్వం, కాస్త చిలిపితనం, ఎవరైనా విసిగించినప్పుడు పెట్టే బుంగమూతి, పైకి కోపంలా కనిపించే చిరాకు ఇవన్నీ ఎంత అందంగా ఉంటాయో మీనాక్షిలో అసలు. జీవితం మీద చాలా ఆశలు పెట్టుకుని కూడా ఏదీ సాధించలేక ఇలా ఉండిపోయానని ఎప్పుడూ ఒక నిరాశలో ఉంటుంది కానీ.. గొప్ప కుటుంబం, బాగా ఇష్టపడే మనుషులు నీ చుట్టూరా ఉన్నారు, నువ్వే గుర్తించట్లేదే వెర్రిమొహమా అని సరదాగా మొట్టికాయ వేయాలనిపిస్తుంది నాకైతే మీనాక్షిని చూస్తుంటే. ఇంతకీ మీనాక్షి ఎవరో మీకు చెప్పలేదు కదూ..! చెప్తా చెప్తా..'మీనాక్షి'.. నాకెంతో ఇష్టమైన పాత్ర'మీనాక్షి'.. నాకెంతో ఇష్టమైన పాత్రకళాతపస్వి కే.విశ్వనాథ్ గారు సృష్టించిన ఎన్నో అద్భుతమైన సినిమాల్లో 'స్వర్ణకమలం' ఒకటి. ఆ సినిమాలోని ఒక పాత్రే మనం మాట్లాడుకుంటున్న ఈ మీనాక్షి. సినిమా చూసే మామూలు ప్రేక్షకులందరికీ మీనాక్షి అంటే ఒక క్యారెక్టర్ అంతే.. కానీ నాకు మాత్రం మీనాక్షి అంటే ఒక ఇష్టం, ఒక ప్రేమ, మళ్లీ మళ్లీ చూడాలనిపించే ఒక వ్యసనం. శాస్త్రీయ కళలు ఏమైనా తిండి పెడతాయా ఏంటి.. గొప్పగా బతికేయాలి, పైపైకి ఎగిరిపోవాలి, సినిమాల్లో హీరోయిన్లలా సోకులు పడాలి అనే ఆరాటం ఎక్కువ మీనాక్షికి. కళ్ల ముందే మంచి జీవితం ఉన్నా, పది మంది మెచ్చుకునే నాట్యకళ తనలో ఉన్నా అవేవీ పెద్దగా గుర్తించదు. ఒక్క మాటలో చెప్పాలంటే లోకం పోకడకు అలవాటు పడి ఉన్నది వదిలేసి, లేనిదాంట్లో సంతోషం వెతుకుతుంది. మనిషి మంచిదే కానీ, చిన్నచిన్న వాటికే ఈజీగా అబద్దాలు చెప్పేయడం, మొండిపట్టు, చలాకీతనం ఇవే కొంచెం ఎక్కువ.'మీనాక్షి'.. నాకెంతో ఇష్టమైన పాత్ర'మీనాక్షి'.. నాకెంతో ఇష్టమైన పాత్రగొంతు అరిగేలా పాటలు పాడడం, కాళ్లు నొప్పులు పుట్టేలా ఈ డాన్సులు ఎందుకు పనికొస్తాయని.. చిరిగిన దుప్పటి కన్నంలో నుంచి తన జీవితాన్ని చూసుకుంటూ నిట్టూర్చే అమాయకురాలు మా మీనాక్షి. 'కొలువై ఉన్నాడే..' పాటలో మీనాక్షిని చూస్తుంటే కళ్లు తిప్పుకోలేం అసలు. ఇష్టం లేకుండా డాన్స్ చేస్తుంటేనే అంత బాగుందేంటని అనిపిస్తుంది నాకైతే. ఆ పెద్ద కళ్లను అలా తిప్పుతూ, శరీరాన్ని తాళానికి తగ్గట్లుగా అనునయిస్తూ సాక్షాత్తూ నటరాజ స్వామి ఆడరూపంలో వచ్చినంత అద్భుతంగా ఉంటుంది మీనాక్షి డాన్స్ చేస్తుంటే. అంత కళని తన దగ్గరే పెట్టుకుని కూడా.. టీవీలో వచ్చే సినిమా పాటకు మైమరచిపోయి ఊగిపోయే పిచ్చిమాలోకం మా మీనాక్షి.'మీనాక్షి'.. నాకెంతో ఇష్టమైన పాత్ర'మీనాక్షి'.. నాకెంతో ఇష్టమైన పాత్రఅన్నట్లు.. మీనాక్షి గజ్జెలు బావిలో పడేసి చేసిన అల్లరి ఎలా మర్చిపోయాం అసలు? కావాలనే గజ్జెలు బావిలో పారేసి, చిలుము పట్టాయని బాగు చేస్తుంటే అనుకోకుండా జారి బావిలో పడిపోయాయని అమాయకంగా మొహం పెట్టేసి అబద్దం చెప్పేసే పెంకితనం ఏంటి మీనాక్షి నీకు? చుట్టూ ఉన్నవాళ్లంతా ఏం పర్లేదు.. బావిలో నుంచి గజ్జెలు తీద్దామనే ప్రయత్నాల్లో ఉన్నప్పుడు మీనాక్షి మొహం చూడాలి. లోలోపల వాళ్లని బండబూతులు తిట్టుకుంటూ.. తలను కోపంగా ఆడిస్తుంటే నాకు మాత్రం తెగ నవ్వొచ్చేస్తుంది. ఎలాగోలా కష్టపడి గజ్జెలు బయటికి తీశారు అని తీసి చూపించినప్పుడు ఎంత ముద్దుగా ఉంటుందో మీనాక్షి ఎక్స్‌ప్రెషన్. చిన్నపిల్లలు అలిగినట్లు పెట్టే ఆ బుంగమూతి, తిడుతున్నట్లు తల ఆడించడం మరింత అందంగా ఉంటాయి.'మీనాక్షి'.. నాకెంతో ఇష్టమైన పాత్ర'మీనాక్షి'.. నాకెంతో ఇష్టమైన పాత్రఏది ఏమైనా క్లాసికల్ డ్రెస్‌లో ఉన్నప్పుడు మీనాక్షిని చూడాలి.. తన ముందు ఎవరూ పనికి రారేమో అనిపిస్తుంది నాకైతే. ఇక ఆ డ్రెస్‌ని అదుముకున్న శరీరం నృత్య భంగిమలు ప్రదర్శిస్తుంటే, లయబద్దంగా కాళ్లు కదుపుతూ ఉంటే.. ఆ కాళ్లకు కట్టుకున్న గజ్జెల సవ్వడి నా గుండె చప్పుడు లాగే ఉంటుందేమో. కానీ, మొండిఘటం.. ఒకసారి నృత్య ప్రదర్శన ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఇష్టం లేక గజ్జెల పట్టీలను బ్లేడుతో కోసేసి పంతం తీర్చుకోవాలి అనుకున్న పిచ్చిపిల్ల మీనాక్షి. అప్పుడు సినిమాలో వెంకటేష్ లాగే నాకు కూడా గట్టిగా చెంప పగలకొట్టాలి అనిపించిందంటే నమ్మండి. పెద్ద ఫైవ్ స్టార్ హోటల్లో తనకు నచ్చిన విధంగా హౌస్ కీపింగ్ జాబ్ దొరికినప్పుడు ఎగిరి గంతేసింది కానీ.. అదే హోటల్లో క్లాసికల్ డాన్స్ చేయాలి అన్నప్పుడు ఎక్కడ పోయినా నాకు ఈ శని తప్పదా అన్నట్లు మొహం పెట్టే మీనాక్షి అవస్థలు చూడాలి అప్పుడు.. హహహ్హ..'మీనాక్షి'.. నాకెంతో ఇష్టమైన పాత్ర'మీనాక్షి'.. నాకెంతో ఇష్టమైన పాత్రఆ తర్వాతే తెలుసుకుంది.. తను ఎలాంటి గొప్ప కుటుంబం నుంచి వచ్చిందో.. ఎలాంటి గొప్ప కళాకారుడి కడుపున పుట్టిందో అని. ఇన్నాళ్లు ఏదో మాయలో ఉండిపోయి ఏం కోల్పోయిందో అప్పుడు అర్థమైంది తనకి. తెలియకుండానే తన చేతులు రెండు ఒక దగ్గర చేరి దండం పెట్టేశాయి.. తెలుసుకున్నాక కాళ్లు ఆడడం మొదలుపెట్టేశాయి. హృదయం ఉప్పొంగి తాండవం చేస్తుంటే.. కదులుతున్న ఒక్కో శరీర భంగిమకి తన కళ్లల్లో నుంచి నీరు కూడా బయటికి వచ్చి కనుల కొలనులో నృత్యం చేస్తున్నట్లుగా ఎంత అద్భుతం అసలు. మీనాక్షి నాట్యం చేస్తూ పరవశించి పోతున్నప్పుడు చూసే నేను మురిసిపోకుండా ఎలా ఉండగలను? అసలు ఆ శరీరంలో మెలికలు ఏంటి?.. ఏ భంగిమ పెట్టినా అలా మారిపోయే ఆ ఆకృతులు ఏంటి? హిమాలయ కొండల్లో నృత్యం చేస్తున్న పార్వతీదేవిలా కనిపిస్తే చేతులెత్తి మొక్కాలని మొదటిసారి అనిపించింది ఆ సమయంలో మీనాక్షిని చూస్తుంటే.'మీనాక్షి'.. నాకెంతో ఇష్టమైన పాత్ర'మీనాక్షి'.. నాకెంతో ఇష్టమైన పాత్ర'అందెల రవమిది పదములదా..' అని హీరో నాట్యం చేస్తున్న మీనాక్షి కాలిని అందుకుని తనపై పెట్టుకున్నప్పుడు, కళ్లలో నీళ్లు పెట్టుకుంటున్న మీనాక్షి ఈ ఆనందం 'అంబరమంటిన హృదయముదా..' అని మైమరిచిపోతుంటే ఆ అనుభూతి ఎంత గొప్పగా ఉంటుందో వర్ణించడానికి మాటలు సరిపోతాయా? ఆ రోజు డాన్స్ చేసింది మీనాక్షి శరీరం మాత్రమే కాదు.. తన మనసు కూడా. హృదయం నిండా నిండిపోయిన నాట్యంతో కాలికి ఉన్న గజ్జెలను అపురూపంగా తాకుతూ అదుముతున్నప్పుడు మీనాక్షి పరవశం చూడాలి.. మాటలకు అందని అనుభూతిని మొహంలో ఇలాగే పలికించాలేమో అన్నంత అద్భుతంగా ఉంటుంది. చేస్తున్న పనిపై మనసు లగ్నం చేసి చేస్తే కలిగే ఆ సంతృప్తిని మాటల్లో చెప్పలేం.. అనుభవించి తీరాలంతే.'మీనాక్షి'.. నాకెంతో ఇష్టమైన పాత్ర'మీనాక్షి'.. నాకెంతో ఇష్టమైన పాత్రనాట్యం, అందులోని గొప్పతనం, బాగుందని పది మంది కొట్టే చప్పట్లు.. వీటన్నిటి విలువ ఏంటో తెలుసుకున్నాక తనకు కావాల్సింది దొరికింది మీనాక్షికి. ముందు నుంచి తను కోరుకున్నట్లుగానే ఎగిరిపోయే అవకాశం అప్పుడే వచ్చింది. విమానం ఎక్కి గాలిలో ఎగిరి అమెరికా వెళ్లి డాన్స్ చేసే అదృష్టం దొరికింది. కానీ, తన ప్రేమ తనని అక్కడే ఆపేసింది. తన కోసం, తను ఇలా మారడం కోసం, నిజం ఏంటో తెలుసుకుని తనలోని నటరాజ స్వామిని మేల్కొల్పిన మంచి మనిషి తోడు కోరుకుంది. అందుకే అంది వచ్చిన గొప్ప అవకాశాన్ని, తన కలను కూడా పక్కన పెట్టేసి తన కోసం ఎదురుచూస్తున్న మనిషి కోసం, ఆ మనిషి ప్రేమ కోసం తిరిగి వచ్చేసిన బంగారం మీనాక్షి. ఇదంతా కలిపితే నా మీనాక్షి.. ఈ పాత్రలో అద్భుతంగా నటించి కాదు.. జీవించిన భానుప్రియ గారిని కనీసం చివరిలో అయినా గుర్తు చేసుకోకపోతే నన్ను ఎవరూ క్షమించరేమో..!'మీనాక్షి'.. నాకెంతో ఇష్టమైన పాత్ర'మీనాక్షి'.. నాకెంతో ఇష్టమైన పాత్రNOTE: ఈ సినిమా అంటే ఎంత ఇష్టమో.. ముఖ్యంగా మీనాక్షి పాత్ర అంటే ఎంత ప్రేమో నా మాటల్లో నేను చెప్పేశాను. ఇదంతా చదివిన మీకు నిజంగా ఇది నచ్చి ఉంటే ఒక్కసారి 'స్వర్ణకమలం' సినిమా చూడండి. ఈ జెనరేషన్ వాళ్లకు నిజంగా దీని గురించి పెద్దగా తెలియకపోవచ్చు.. కానీ, మనసు పెట్టి చూస్తే మాత్రం నాలాగే మీరూ ప్రేమలో పడిపోతారు మీనాక్షితో.. నిజం అండీ బాబూ.. అర్థం చేసుకోరూ..!'మీనాక్షి'.. నాకెంతో ఇష్టమైన పాత్ర


THANK YOU

PC: VAMSI MOHAN



కామెంట్‌లు

  1. నిజం అన్నా నాకూ ఆ సినిమా అంటే పిచ్చి ఎన్నిసార్లు వచ్చిన చూస్తాను క్లాసికల్ డాన్స్ అంటే కూడా పిచ్చి నాకు ఇంకా ఈ సినిమా లోని పాటలు కూడా అంతే పిచ్చి చాలా బాగున్నాయి...

    రిప్లయితొలగించండి

కామెంట్‌ను పోస్ట్ చేయండి