బోనాల పండగ వచ్చేసింది..!

'అమ్మా బైలెల్లినాదో..' ఆషాఢ మాసం వచ్చిందంటే ఎక్కడ చూసినా బోనాల పండగ సందడే. అందరిలాగే నాకు కూడా బోనాల పండగ అంటే ఏదో కొంచెం తెలుసు అంతే. చిన్నప్పటి నుంచి చూస్తున్నాం, దేవుడు అని మొక్కుతున్నాం అని అంతవరకే లెండి. కానీ, బోనాలు అసలు ఎందుకు చేస్తారు? దీని వెనక కథ ఏంటని మాత్రం ఎప్పుడూ నేను ఆలోచించలేదు. బహుశా మీలో కొంత మందికి తెలిసే ఉంటుంది. అందుకే నేను కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దామని ఇలా మొదలెట్టా అన్నమాట.బోనాల పండగ వచ్చేసింది..!బోనాలు తీయడం చిన్నప్పుడు ఊళ్లల్లో ఎక్కువగా చూసేవాడిని. ఇప్పటికీ హైదరాబాద్‌లో చాలా బాగా చేస్తుంటారు బోనాల పండగని. ప్రతి సంవత్సరం చూస్తుంటాం.. మరి అసలేంటి ఎందుకు చేస్తారని తెలుసుకోవాలి కదా మనం కూడా. బోనం అంటే భోజనం అని అర్థం. ఓ పచ్చి కుండను పసుపు, కుంకుమలతో అమ్మవారి రూపంగా అలంకరించి, వేప కొమ్మలు తగిలించి పైన దీపం పెడతారు. ఆ కుండ లోపల వండిన అన్నం, పెరుగు.. ఇలా ఎవరికి నచ్చిన విధంగా వాళ్లు నైవేద్యం వండుతారు. అలా అందంగా తయారుచేసుకున్న బోనం కుండని అమ్మవారికి సమర్పించి అంతా బాగుండాలని, వర్షాలు పడాలని, అనుకున్నవి నెరవేరాలని.. ఇలా ఎవరికి వాళ్లు తమ కోరికలను అమ్మవారికి చెప్పుకుంటారు.బోనాల పండగ వచ్చేసింది..!మరి ఈ బోనాల పండగ జరపడం ఎప్పటి నుంచి మొదలైందో తెలుసా?.. సుమారు 600 ఏళ్ల క్రితమే ఈ ఆచారం మొదలైందని చెప్తారు. కాకతీయుల కాలంలో చాలా ఘనంగా ఈ పండగ చేసేవారు. ఇక ఆ తర్వాత హైదరాబాద్‌లో కుతుబ్ షాల పరిపాలన వచ్చాక కూడా ఈ పండగను కొనసాగించారు. ఆ సమయంలో గోల్కొండలో కొలువై ఉన్న జగదాంబిక అమ్మవారి ఆలయం నుంచి మొదటి బోనం తీయడం ప్రారంభించారు.. అది ఇప్పటికీ అలాగే కొనసాగుతోంది.బోనాల పండగ వచ్చేసింది..!1815లో హైదరాబాద్ ప్రాంతంలో కలరా వ్యాధి వచ్చి చాలా మంది చనిపోయారట. అయితే ఆ సమయంలో సూరటి అప్పయ్య అనే ఆర్మీ సైనికుడు మధ్యప్రదేశ్ రాష్ట్రం వెళ్లి ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకుని తమ ప్రాంతంలో కలరా వ్యాధి తగ్గేలా కరుణించాలని, హైదరాబాద్‌లో కూడా గుడి కట్టిస్తానని మొక్కుకున్నాడట. అనుకున్నట్లుగానే ఆ తర్వాత వ్యాధి తగ్గిపోవడంతో అంతా అమ్మవారి దయే అని నమ్మి సికింద్రాబాద్ ప్రాంతంలో ఉజ్జయిని మహంకాళి ఆలయం నిర్మించాడు. ఇక అప్పటి నుంచి బోనాల పండగ మరింత ఘనంగా జరపడం మొదలుపెట్టారు.బోనాల పండగ వచ్చేసింది..!ఆషాఢ మాసంలోనే బోనాలు ఎందుకు తీస్తారు?.. హిందూ ఆచార ధర్మాల ప్రకారం ఆషాఢ మాసం అనేది అమ్మవారు తన పుట్టింటికి వెళ్లే సమయం అని నమ్ముతారు. ఆడబిడ్డ తమ ఇంటికే వస్తుందని నమ్ముతూ సంతోషంగా పండగ చేసుకుంటారు. అదే కాకుండా.. ఎండలు మెల్లగా తగ్గి వర్షాలు పడే సమయం ఇది. ఈ కాలంలో అంటువ్యాధులు, కలరా వంటివి ఎక్కువగా వ్యాపిస్తాయి. అందుకే బోనం పండగ పేరుతో ఇంటి గడపలకు పసుపు రాసి, వేపకొమ్మలను తోరణాలుగా కడతారు. వీటి వల్ల రోగాల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉంటామని ఒక శాస్త్రీయ కారణం ఉంది.బోనాల పండగ వచ్చేసింది..!బోనం కుండని మనం చాలా సార్లు చూసే ఉంటాం సరే.. మరి దానికి పసుపు ఎందుకు పూస్తారు? వేపకొమ్మలు ఎందుకు కడతారు? ఎప్పుడైనా ఆలోచించారా? బోనాల పండగని ఆషాఢ మాసంలో చేస్తారని తెలుసుకున్నాం కదా. అసలే వర్షాకాలం. పురుగు పుట్రా వచ్చే కాలం. అందుకని కుండలో పెట్టిన నైవేద్యం బ్యాక్టీరియా బారిన పడకుండా శుభ్రంగా ఉండాలని పసుపు పూసి వేపకొమ్మలు కడతారు. ఈ రెండు యాంటీ బయోటిక్ మెటీరియల్స్ అని మనకు తెలుసు కదా. ఇక పైన పెట్టే దీపం అంటారా?.. పాత కాలంలో ఇప్పటిలాగా కరెంట్ ఉండేది కాదు. రాత్రిపూట అమ్మవారికి బోనాలు తీసుకెళ్తున్న సమయంలో వెలుతురు ఉండాలి కదా.. దానికోసం అన్నమాట.బోనాల పండగ వచ్చేసింది..!ఒళ్లంతా పసుపు, కుంకుమ పూసుకుని, పొడవైన జుట్టుతో కళ్లు పెద్దవి చేస్తూ కొరడా పట్టుకుని డాన్స్ చేసే పోతరాజుని అందరూ చూసే ఉంటారు. మరి ఈ బోనాల సమయంలో ఎందుకు కొందరు ఇలా పోతరాజు వేషాలు వేసుకుని కనిపిస్తారు. హిందూ ధర్మంలో పోతరాజు అనేవాడు అమ్మవారికి స్వయానా తమ్ముడు అని చెప్తారు. మరి ఆడబిడ్డ పుట్టింటికి వస్తే అన్నీ అన్నదమ్ములే కదా చూసుకునేది. అందుకే అమ్మకు రక్షణగా దుష్టశక్తులు దగ్గరికి రాకుండా విచిత్రంగా వేషం కట్టి భయపెట్టేలా పోతరాజు బోనాలు జరిగే ప్రతి ఆలయంలో ఉంటాడు అన్నమాట.బోనాల పండగ వచ్చేసింది..!ఇక మొత్తం బోనాల సంబరాల్లో అతి ముఖ్యమైన ఘట్టం రంగం. ఇది మీరు ఎప్పుడైనా విన్నారా? రంగం అంటే భవిష్యవాణి చెప్పడం. అంటే జరగబోయేది చెప్పడం అన్నమాట. పచ్చికుండ మీద నిలబడి ఎదురుగా అమ్మవారి విగ్రహాన్ని చూస్తూ ఒక ఆడమనిషి ఈ రంగం చెప్తుంది. అప్పుడు ఆమె మీదికి సాక్షాత్తూ అమ్మవారు వస్తారని, అమ్మవారే స్వయంగా తనతో భవిష్యవాణిని మాట్లాడిస్తారని అందరి నమ్మకం. తర్వాతి రోజుల్లో ఎలా ఉండబోతుంది? వర్షాలు కురుస్తాయా? అంతా సంతోషంగా ఉంటారా? ఇలా ప్రతి విషయాన్ని రంగం చెప్పే మహిళ కళ్లు పెద్దవి చేస్తూ ఉగ్రరూపంతో ఊగిపోతూ చెబుతుంది అన్నమాట. ఇలా రంగం చెప్పే మహిళలు ఒక ఇంటి నుంచే తరతరాలుగా వస్తూ చెప్పడం ఆనవాయితీ. వాళ్లు చెప్పేవన్నీ ఖచ్చితంగా జరిగి తీరుతాయని, సాక్షాత్తూ అమ్మవారే ఆ మహిళ రూపంలో వచ్చి నిలబడతారని నమ్మకం.బోనాల పండగ వచ్చేసింది..!ఇలాంటివి నిజమా?.. కాదా?.. అనే విషయాన్ని పక్కన పెడితే.. పండగ పేరుతో అందరం ఒక్క దగ్గర చేరి సంతోషంగా గడుపుతాం. మనుషుల్లో ప్రేమ, ఆప్యాయతలను చూస్తాం. అందరికీ దిక్కు ఆ దేవుడే అని భక్తితో మొక్కి మనసును ప్రశాంతత చేసుకుంటాం. దైవత్వం అనే కనిపించని ఒక దివ్యత్వాన్ని నమ్ముతాం. బోనాల సమయంలో అమ్మవారు అలా వస్తారని, మనతో మాట్లాడతారని నమ్ముతాం. అందుకే నా హిందూ ధర్మం నిజంగా గొప్పది.. కాదంటారా మీరు..?బోనాల పండగ వచ్చేసింది..!


THANK YOU 

PC & SUPPORT BY: CH.VAMSI MOHAN 


కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి