దేవదాసీ వ్యవస్థ

భారతదేశం.. ఎన్నో కళలకు పుట్టినిల్లు. ఎన్నో మంచి మంచి కట్టుబాట్లకు, సంప్రదాయాలకు పెట్టింది పేరు అని మనం చిన్నప్పుడు చదువుకున్నాం. మరి అలాంటి మన దేశంలోనే మూఢ నమ్మకాలు కూడా ఉంటాయన్న సంగతి తెలుసు కదా. ముఖ్యంగా మన భారతీయులు ఏదైనా గుడ్డిగా నమ్మేసే అమాయకులు. అలా మన భారతీయ సమాజం గుడ్డిగా నమ్మి పోషించిన ఒక చీకటి కోణం 'దేవదాసీ' వ్యవస్థ.

దేవదాసీ వ్యవస్థ

ఈ దేశంలో స్త్రీలను దేవతలుగా పూజిస్తారు. ఎక్కడైతే ఆడవాళ్లు గౌరవింపబడతారో అక్కడ దేవతలు కొలువుంటారని నమ్మే దేశం మనది. మరి ఇదే దేశానికి ఆడదాన్ని బలి పశువును చేసిన చరిత్ర కూడా ఉంది. అదే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న దేవదాసీ వ్యవస్థ. ఆడపిల్ల పుడితే భారం అని కడుపులోనే చంపేసేవాళ్లు ఎంతో మంది. టెక్నాలజీ మారిన ఇప్పటి ప్రపంచంలో కూడా ఆడపిల్ల అంటే తక్కువ అని చూసేవాళ్లు అక్కడక్కడా లేకపోలేదు. కానీ, మన పుట్టుక నుంచి చావు వరకు ప్రతి విషయంలో ఆడదాని అవసరం లేకుండా మన జీవితం ముందుకు సాగదనే విషయం గుర్తుంచుకోవాలి. తరతరాలుగా ఆడపిల్లని మన అవసరాలకు తగ్గట్లు మార్చుకున్నాం. అలాంటిదే ఈ దేవదాసీ కూడా.

దేవదాసీ వ్యవస్థ

సింపుల్‌గా చెప్పాలంటే దేవదాసీ అంటే.. ఒక అమ్మాయిని చాలా చిన్న వయసులోనే దేవుడికి ఇచ్చి పెళ్లి చేయడం అన్నమాట. ఏదైనా వ్యాధి ఊరిని పట్టి పీడించినప్పుడు ఇలా దేవుడికి ఆడపిల్లని ఇచ్చి పెళ్లి చేస్తే మంచి జరుగుతుందని.. లేదా పిల్లలను పోషించలేని స్థితిలో ఉన్న కుటుంబంలోని ఆడపిల్లలను దేవదాసీని చేసి ఊరికి అప్పగించడం.. ఇలా దీని వెనక చాలానే కారణాలు ఉన్నాయి. అలా ఒకే కుటుంబం నుంచి తరతరాలుగా ఆడపిల్లలు దేవదాసీలుగా మారేవారు. ఇక అప్పటి నుంచి ఆ అమ్మాయికి ఎలాంటి పర్సనల్ లైఫ్ ఉండదు. జీవితం మొత్తం దేవుడికే అంకితం కావాలి. గుడిలో దేవుడి ముందు గజ్జె కట్టి ఆడాలి. ఊళ్లోని పెద్దవాళ్లను తన నాట్యంతో సంతృప్తి పరచాలి. అలా వచ్చిన కానుకలు, డబ్బులతో బతికేయాలి.

దేవదాసీ వ్యవస్థ

మొదట్లో ఈ దేవదాసీ వ్యవస్థ మంచిగానే ఉండేది. దేవుడికే జీవితాన్ని అంకితం చేసిన అలాంటి ఆడవాళ్లను ఎంతో గౌరవించేవారు. ఎన్నో దేవాలయాలను వాళ్ల పేరు మీదే రాసి ఇచ్చేసేవాళ్లు. గుడిలో అన్ని కార్యాలు దేవదాసీల ఆధీనంలోనే జరిగేవి. కొన్ని చోట్ల అయితే ఆ ప్రాంతాన్ని పాలించే మహారాణి కన్నా దేవదాసీల వైభోగమే గొప్పగా ఉండేది. ఏదైనా పెళ్లికి ముహూర్తం పెట్టాలన్నా, ఎవరి ఇంట్లో అయినా శుభకార్యం జరిగినా వీళ్లు ఖచ్చితంగా ఉండాల్సిందే. వాళ్లు మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తే అంతా మంచే జరుగుతుందని నమ్మేవాళ్లు. దేవదాసీలు చాలా ధనవంతులుగా బతికేవాళ్లు. ఎంతలా అంటే, ఎవరి పెళ్లికి అయినా వెళ్తే.. వాళ్ల మెడలో ఉన్న బంగారు ఆభరణాలు అప్పటికప్పుడు తీసి బహుమానంగా ఇచ్చే అంత.

దేవదాసీ వ్యవస్థ

అలాంటి దేవదాసీ వ్యవస్థను పోను పోను చాలా నీచంగా దిగజార్చారు. చేతులెత్తి మొక్కే స్థాయి నుంచి పక్కలోకి పిలిచి అనుభవించేంత. బ్రిటిష్ పాలనలో దేశం మగ్గుతున్న సమయంలో దేవదాసీ వ్యవస్థను మరింత చులకన చేశారు. వాళ్లకు రావాల్సిన డబ్బులు, కానుకలు అందనివ్వకుండా బానిసల్లా మార్చుకున్నారు. ఆ తర్వాత కాలంలో దేవదాసీలను కేవలం పడక గదికే పరిమితం చేసిన రోజులు వచ్చాయి. అందంగా ఉన్న ఏ ఆడపిల్ల కూడా పెళ్లి చేసుకుని ఒకరికే పరిమితం కాకూడదని, ఆ అందం అందరికీ సొంతం కావాలనే పద్దతి వచ్చింది. అలా ఊళ్లో ఉన్న భూస్వాములు, దొరలు, ధనికులకు దేవదాసీగా ఉన్న మహిళ పడక సుఖం అందించాలని కట్టుబాటు ఉండేది. ఆ సంస్కృతికి కట్టుబడి ఎదురు చెప్పలేక ఇదే తమ జీవితమని నమ్మి చీకటి బతుకు బతికిన స్త్రీలు ఎంతో మంది మన దేశంలో అప్పట్లో. ఎక్కువ మందితో గడపడం వల్ల సుఖ వ్యాధులకు గురై ప్రాణాలు కోల్పోయిన దేవదాసీలు ఇంకా ఎందరో.

దేవదాసీ వ్యవస్థ

ఏదైనా కారణంతో దేవదాసీ చనిపోతే.. ఆ ఇంటి నుంచి తర్వాత తరం అమ్మాయి దేవదాసీగా మారాల్సిందే. ఈ దేవదాసీలకు రూల్స్ కూడా చాలా కఠినంగా ఉండేవి. దేవదాసీగా మారే అమ్మాయికి గుడిలోని పూజారి దేవుడి పేరు మీద తాళి కడతాడు.  దేవుడి సేవకే అంకితం కావాలి. ఎప్పుడూ అబద్దం ఆడకూడదు. ఇక ఆ దేవదాసీ అమ్మాయి పుష్పవతి అయిన తర్వాత నుంచి శారీరకంగా అనుభవించడానికి అర్హురాలు అవుతుంది. ఇదే వ్యవస్థను మన తెలంగాణలో జోగిని అని పిలుస్తారు.

దేవదాసీ వ్యవస్థ

అలా కొన్నేళ్లు చీకటిలోనే మగ్గిన నీచమైన కట్టుబాట్లకు దేశానికి స్వాతంత్య్రం వచ్చాక ముగింపు దొరికింది. 1947, అక్టోబర్ 9న మద్రాసు దేవదాసీ చట్టం ద్వారా దేవదాసీ వ్యవస్థ రద్దు చేయబడింది. దేవదాసీలకు వివాహం చేసుకునే హక్కు చట్టం కల్పించింది. భారతీయ దేవాలయాలకు బాలికలను అంకితం చేయడాన్ని కూడా చట్టవిరుద్ధం చేసింది. ఏది ఏమైనా మూఢ నమ్మకాల ముసుగులో ఆడదాన్ని అంగట్లో బొమ్మను చేసి ఆడించిన సంస్కృతి పోయింది. మన ఇంట్లో ఉన్న తల్లి, చెల్లితో పాటు ప్రతి ఆడపిల్ల స్వేచ్ఛగా తన బతుకు బతికే రోజులు వచ్చాయి. ఈ రోజు మహిళ ఎన్నో రంగాల్లో దూసుకుపోతూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తుంది.

దేవదాసీ వ్యవస్థ

ఓ స్త్రీమూర్తి.. నీ జీవితాన్ని ఎదగనివ్వకుండా కట్టుబాట్లతో నీకు బానిస సంకెళ్లు వేసినందుకు మన్నించు. ఆడపిల్లను నీచంగా చూసిన ఒకప్పటి ఈ దేశం తరపున.. పాలిచ్చి పెంచే తల్లి నుంచి పెళ్లి అనే పద్దతితో మన జీవితంలో సగ భాగమయ్యే ప్రతి మహిళకు క్షమించమని చేతులెత్తి మొక్కుతున్నా.

దేవదాసీ వ్యవస్థ

THANK YOU 


PC: CH.VAMSHI MOHAN 


కామెంట్‌లు

  1. ఇప్పటికైనా ఇలాంటి వ్యవస్థకు స్త్రీ బలి కాకూడదని కోరుకుందాం...

    రిప్లయితొలగించండి

కామెంట్‌ను పోస్ట్ చేయండి