ఆకాశ వీధిలో అందాల జాబిలి

అనగనగా ఒక 'మహానటి'....

ఆకాశ వీధిలో అందాల జాబిలి

సావిత్రి గారు.. తెలుగు సినిమా నటి ప్రస్తావన వస్తే మొదట తలుచుకునే పేరు నీదే అని 'మహానటి' సినిమాలో చెప్పిన మాట నూటికి నూరుపాళ్లు నిజం. సావిత్రి గారు అంటే ఎవరు..? ఆవిడ గొప్పతనం ఏంటి..? అని తెలియని ఈనాటి జనరేషన్‌కి 'మహానటి' సినిమా ఆ విషయాలను కళ్లకు కట్టినట్టు చూపించింది. టాలీవుడ్ చరిత్రలోనే ఎప్పటికీ నిలిచిపోయే అద్భుతం అయింది. ఎంతో మంది ప్రేక్షకులకు మర్చిపోలేని ఓ జ్ఞాపకం అయింది.

ఆకాశ వీధిలో అందాల జాబిలి
ఇలా సావిత్రి గారి మీద బయోపిక్ తీస్తున్నారు అన్నప్పుడు అందరిలాగే నాకూ పెద్దగా సినిమా మీద ఆశలు లేవు.. జనాలకు పెద్దగా పరిచయం లేని డైరెక్టర్ నాగ్ అశ్విన్.. మరీ ముఖ్యంగా ఆ పాత్రలో కీర్తి సురేశ్ సెట్ అవుతుందా లేదా అనే డౌట్.. మొత్తానికి ఏదో సినిమా తీస్తున్నారులే అని ఊరుకున్నా.. కానీ, సినిమాపై మొదటిసారిగా ఇంట్రెస్ట్ పుట్టింది.. ట్రైలర్ రిలీజ్ అయిన రోజే. అప్పటి కాలాన్ని గుర్తు చేసే ఆ సెట్స్, ఆ పాత్రలు, మనసుకు హత్తుకునే కొన్ని డైలాగ్స్.. ముఖ్యంగా సావిత్రి గారిలా మారిన కీర్తి సురేశ్‌ని మొదటిసారి చూశాక ఓ మంచి సినిమా త్వరలో చూడబోతున్నామని అనిపించింది.

ఆకాశ వీధిలో అందాల జాబిలి
సినిమా మొదట్లోనే నిస్సహాయ స్థితిలో పడి ఉన్న సావిత్రి గారిని హాస్పిటల్లో చేర్పించడం.. దిక్కూమొక్కు లేకుండా నేల మీద పడుకోబెట్టారని చూపించడం ద్వారా ఒక మహోన్నత వ్యక్తిత్వాన్ని ముందు ముందు చూడబోతున్నామని ఎలివేషన్ ఇవ్వడం కన్నా అద్భుతం ఏముంటుంది చెప్పండి..?

ఆకాశ వీధిలో అందాల జాబిలి
ఆ తర్వాత మాయాబజార్ సెట్‌లో శశిరేఖ పాత్రలో చూపించడంతో ఒక హీరోయిన్‌కి ఇంత కన్నా గొప్ప ఇంట్రడక్షన్ సీన్ ఏముంటుందని ఆశ్చర్యపోయేలా చేశారు. మరీ ముఖ్యంగా సావిత్రి గారి నటప్రస్థానంలోనే అరుదైన ఘట్టం.. ఒక కంటి నుంచి రెండు కన్నీటి బొట్లు కార్చడం.. అది కూడా ఎలాంటి గ్లిజరిన్ అవసరం లేకుండా. ఇది నిజంగానే సావిత్రి గారి జీవితంలో జరిగిందని ఎంతో మంది ప్రత్యక్ష సాక్షులు చెప్పడం మనం కొన్ని వీడియోల్లో చూశాం. ఇలాంటి ఓ అద్భుతమైన సీన్ ద్వారా సావిత్రి గారిని అసలు మహానటి అని ఎందుకు అంటారో సగటు ప్రేక్షకుడికి అర్థమయ్యేలా మొదట్లోనే చూపించడం దర్శకుడి ప్రతిభకు నిదర్శనం.

ఆకాశ వీధిలో అందాల జాబిలి
సినిమాల్లో అవకాశాల కోసం సావిత్రి గారు మద్రాసు వచ్చి ప్రయత్నిస్తుంటే.. అక్కడ జెమినీ గణేశన్ పరిచయమవుతాడు. సినిమాని ప్రేమించి, స్క్రీన్‌పై తనను తాను చూసుకోవాలని కలలు కంటూ.. అసలు తను హీరోయిన్ అవుతుందో లేదో అన్న భయంతో ఉన్న ఓ అమ్మాయికి అన్నీ తానై ధైర్యం చెప్పి జెమినీ అండగా ఉంటాడు. నాన్న ప్రేమ అంటే తెలియదని పసిపాపలా అడుగుతుంటే జెమినీ ఆ లోటు తీర్చేలా దగ్గర అవుతాడు. అవకాశాలు వెతుక్కుంటూ వచ్చి హీరోయిన్‌గా నిలబడాలని ఆరాట పడుతునప్పుడు మార్గదర్శకుడిలా ముందుండి నడిపిస్తాడు. తనకు పెళ్లి మీద నమ్మకం లేదు, ప్రేమ మీద ఉందని.. అది నిన్ను కలిశాక మొదలైందని చెప్పినప్పుడు ఒక ఆడపిల్ల స్పందించకుండా ఎలా ఉండగలదు? అది కూడా తను సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి సాయం చేసిన అత్యంత ముఖ్యమైన వ్యక్తి అడుగుతుంటే ఎలా కాదనగలదు? ఈ సన్నివేశాల్లో సావిత్రి గారి పాత్రలో ఉండే పసితనం కీర్తి చక్కగా చూపించింది. ఇక జెమినీ గణేశన్‌గా దుల్కర్‌ని తప్ప వేరే ఎవరినీ ఊహించలేం కూడా..!

ఆకాశ వీధిలో అందాల జాబిలి
అమ్మవారి సన్నిధిలో జెమినీ- సావిత్రి గారి పెళ్లి.. సినిమాకే ఓ హైలైట్ సీన్ అని చెప్పొచ్చు. లోపల తనంటే ఎంతో ఇష్టం ఉన్నా, చేసేది తప్పో ఒప్పో అని భయపడుతూ కళ్లలో నీళ్లు పెట్టుకుంటున్న సావిత్రి గారికి ధైర్యం చెప్పి జెమినీ తాళి కట్టే సీన్.. చూసే ప్రేక్షకుడికి మంచి ఫీల్ తెప్పిస్తుంది. ముఖ్యంగా ఆ సీన్‌లో మ్యూజిక్ డైరెక్టర్ మిక్కీ జె మేయర్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మ్యాజిక్ చేసిందనే చెప్పాలి. కన్నవాళ్లని, పెంచినవాళ్లని కూడా బాధపెట్టి పెళ్లి చేసుకుని ధైర్యం చేశారంటే అది జెమినీ మీద సావిత్రి గారికి ఉండే పిచ్చి నమ్మకమే కదా! కొన్నిసార్లు మనకు తెలియకుండానే మన కన్నా ఎక్కువగా మనం ఇష్టపడే వాళ్లనే నమ్ముతాం. అదే ఇక్కడ సావిత్రి గారు చేసిన మొదటి తప్పేమో మరి..!

ఆకాశ వీధిలో అందాల జాబిలి
ఏ రంగంలోనైనా ఎత్తుపల్లాలు సహజం. అలాంటి పరిస్థితులే జెమినీ- సావిత్రి గారి జీవితాల్లో చోటు చేసుకున్నాయి. జెమినీకి హీరోగా అవకాశాలు తగ్గడం, ఇటు సావిత్రి గారు మహానటిగా వెలుగొందుతూ అవకాశాలు అందుకోవడం. సహజంగానే ఒక మగాడికి అసూయ పుట్టించే పరిస్థితి. భార్య ఎదుగుతుంటే తట్టుకోలేని భర్త ఆ కోపాన్ని తన మీద చూపించకుండా మందుకు అలవాటు పడడం, అదేమీ అర్థం కాని సావిత్రి గారు.. తన కాపురం ఎక్కడ కష్టాల్లోకి వెళుతుందో అని భయపడి భర్తని సముదాయించడం.. అవసరమైతే తను సినిమాలు మానేస్తానని అనడం చూస్తే.. తనకొచ్చే పేరు, ప్రతిష్టల కన్నా భర్త సంతోషమే ముఖ్యమని అనుకునే ఒక సగటు ఇల్లాలిని చూస్తాం సావిత్రి గారిలో.

ఆకాశ వీధిలో అందాల జాబిలి
'ఎందుకండీ ఇలా ఉన్నారు..? బాధ పంచుకుంటే తగ్గుతుందట' అని సావిత్రి గారు ఓదార్చినప్పుడు.. 'దా పంచుకో..' అని జెమినీ తాగే మందు గ్లాసుని ఇవ్వడం.. అయినా నువ్వు మహానటివి కదా మాతో ఎందుకు తాగుతావులే అని వెటకారంగా అన్నప్పుడు ఆ పరిస్థితిని హ్యాండిల్ చేయలేని సావిత్రి గారు మొండిగా ఆ గ్లాసుని అందుకుని మందు తాగి మీ కోసం ఏమైనా చేయగలను అని చెప్పకనే చెప్పడం.. చూసే ప్రేక్షకుడికి ఒక ఎమోషనల్ టచ్ ఇస్తుంది. సావిత్రి గారు అలా తన ప్రేమను చెప్పకనే చెబుతూ మౌనంగా ఉంటే, జెమినీ తన తలపై చేయి వేసి నిమరడం ప్రేక్షకుడి గుండెని తాకుతుంది.

ఆకాశ వీధిలో అందాల జాబిలి
పిచ్చిగా ఒక మనిషిని ప్రేమిస్తే నా కన్నా తనకు ఎవరూ ఎక్కువ కాకూడదనే స్వార్థం మామూలుగానే వస్తుంది. నమ్మి ప్రేమించిన వ్యక్తి మోసం చేస్తే ఆ మనిషిని ఎప్పటికీ క్షమించలేని స్థితికి వెళ్లిపోతాం. అది మనకు వాళ్ల మీద ఉండే కోపం కాదు.. గుడ్డిగా నమ్మే మన మనసుకు మనం వేసుకునే శిక్ష. తన సొంతం అనుకున్న జెమినీ తన కళ్ల ముందే వేరే మనిషితో గడపడం చూశాక.. కోపంతో ఊగిపోతూ ఎదురుగా ఉన్న ఆ అమ్మాయిని కొట్టడానికి వెళ్తుంది. తర్వాత తన చెంపలు తనే వాయించుకుంటుంది. దాని అర్థం.. ఇదంతా తను చేసుకున్న ఖర్మ.. తన తప్పే అని తాను రియలైజ్ అవడం. 'ఎందుకు.. ఎందుకు..?' అని గట్టిగా అరుస్తుంది ఆ క్షణంలో సావిత్రి గారు. అది నీకు నేను ఏం తక్కువ చేశానని ప్రశ్నించడం అవ్వొచ్చు.. నువ్వు ఎందుకు ఇలా చేశావు అనే కోపం కావొచ్చు.. 'ఎందుకు?' అని నిలదీసే ఆ ఒక్క మాట వెనక ఎన్ని ప్రశ్నలు ఉన్నాయో, ఎంత వేదన దాగి ఉందో ఆ పరిస్థితిని అనుభవించిన వారికే అర్థమవుతుంది.

ఆకాశ వీధిలో అందాల జాబిలి
కోపంతో ఊగిపోతున్న సావిత్రి గారికి నచ్చజెపుతూ దగ్గరికి వెళ్తుంటే, భర్తని దూరంగా నెట్టేస్తుంది. నా గురించి తెలిసే పెళ్లి చేసుకున్నావ్ కదా?.. నాకు నువ్వే ముఖ్యం అని అన్నప్పుడు ప్రేమ గురించి మాట్లాడే అర్హత నీకు లేదని.. ప్రేమ మీద మొదటిసారి నమ్మకం కోల్పోతుంది సావిత్రి గారు. అద్దంలో తనని తాను చూసుకుంటూ బద్దలు కొట్టినప్పుడు తనకు తాను శిక్ష వేసుకోవడానికి సిద్ధపడుతున్నట్లు సింబాలిక్‌గా చూపించారు. ఆ బాధని దిగమింగుకోవడానికి దూరంగా ఉన్న మందు బాటిల్‌ని దగ్గర తీసుకుంటుంది. ముఖ్యంగా ఇందులో కెమెరా వర్క్ చూస్తే.. తాను మందు బాటిల్ ఎత్తి తాగుతున్నప్పుడు కీర్తి మొహాన్ని ముందు నుంచి చూపించరు. పై యాంగిల్‌లో కెమెరా పెట్టి వెనక నుంచి వస్తూ.. మందు తాగుతూ మంచం మీద పడిపోతూ నిలువెత్తు శిఖరం కూలి పడిపోయినట్లుగా చూపిస్తారు. అప్పుడు సావిత్రి గారి కళ్లల్లో నీటి తడి, మరోవైపు మోసపోయాననే బాధని కీర్తి తన మొహంలో అద్భుతంగా పలికించింది.

ఆకాశ వీధిలో అందాల జాబిలి
ఇదివరకే వేరే ఆడవాళ్లకు సొంతమైన ఒక మనిషిని తను పెళ్లి చేసుకున్నప్పుడు.. మరి తాను కూడా ఇదే బాధని వాళ్లకు ఇచ్చానని తెలుసుకోలేకపోయిందా సావిత్రి గారు. లేదా సొంతం చేసుకున్నాక ఇక తనవాడే అని గుడ్డిగా నమ్మి తప్పు చేసిందా..? నిజంగా ఒక మనిషిని ప్రేమిస్తే త్యాగం చేయడం, అర్థం చేసుకోవడం కూడా ఒకలాంటి ప్రేమే అని అప్పుడు గుర్తించలేదా..? ఇదే సావిత్రి గారిలో ఉన్న అమాయకత్వం. కొందరు ప్రేమించిన మనిషిని నమ్ముతారు.. మరికొందరు భద్రంగా గుండెలో పెట్టుకుంటారు.. కానీ, సావిత్రి గారు తన జీవితమే జెమినీ అని ఆశలు పెంచుకున్నారు. నిజమైన ప్రేమ అర్థం చేసుకోవడంలో ఉంటుంది. అది సాధ్యం కాని కొందరు వాళ్లని వాళ్లే శిక్షించుకుంటారు. సావిత్రి గారు అదే చేశారు.. అంతా మర్చిపోవడానికి మద్యానికి బానిస అయ్యారు.

ఆకాశ వీధిలో అందాల జాబిలి
ఇన్ కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ వాళ్లు వచ్చి ఆస్తులన్నీ జప్తు చేస్తున్నప్పుడు.. మౌనంగా చూస్తూ బాధ పడిందే తప్ప, భర్త సాయం తీసుకుందామనే మాటకి తల వంచని మొండిఘటం సావిత్రి గారు. ముఖ్యంగా ఈ సీన్‌లో మెట్ల మీద చేతిలో మందు గ్లాసుతో కూర్చున్న కీర్తిని చూస్తే సాక్షాత్తూ సావిత్రి గారే దిగి వచ్చారా అన్నంత అనుభూతి కలుగుతుంది. 'నువ్వు పెట్టుకున్న మేనేజర్లు అందరూ దొంగలు.. ఏమైనా సహాయం కావాలా..' అని స్వయంగా జెమినీ వచ్చి అడిగినప్పుడు ఏ సాయం అవసరం లేదని అక్కడి నుంచి వెళ్లిపోమంటుంది. కొన్నిసార్లు అవసరం లేని మొండితనం కూడా పనికి రాదేమో..! జరిగిన తప్పునే గుర్తు పెట్టుకుని అలా బాధ పడుతూ ఉండిపోవడం కన్నా.. తప్పు చేసినవాళ్లని క్షమించడానికి కూడా పెద్ద మనసు కావాలేమో..! ఎవరికైనా కష్టం వస్తే ఏమీ ఆలోచించకుండా ముందుకు వచ్చి సాయం చేసే గొప్ప మనసున్న సావిత్రి గారు.. ఈ ఒక్క విషయంలో మాత్రం గొప్పగా ఆలోచించలేదేమో అని నాకు అనిపిస్తుంది.
ఆకాశ వీధిలో అందాల జాబిలి
తీస్తున్న సినిమాలు ప్లాప్స్ కావడం.. ఆర్థికంగా నష్టపోవడం.. నా అనేవాళ్లు దగ్గర లేకపోవడం.. తల్లి చనిపోవడం.. ఒకప్పుడు తన సాయం పొందినవాళ్లే ఇప్పుడు తను కష్టాల్లో ఉంటే మొహం చాటేయడం దెబ్బ మీద దెబ్బలు. అప్పుల వాళ్లు వచ్చి మీద పడిపోయి మీరు ఎక్కడికైనా పారిపోతే అని ప్రశ్నించినప్పుడు.. 'నేను మరీ అంత మహానటిని కాదు లెండి.. ముందు కెమెరా లేకపోతే బొత్తిగా నటించడం రాదు' అని నిట్టూర్చడం సావిత్రి గారి స్వాభిమానానికి నిదర్శనం. 'తాగి తాగి పోయేలా ఉన్నావు.. మా గురించి పట్టించుకుంటున్నావా..?' అని కూతురు వచ్చి నిలదీసినప్పుడు చీకటి అంతఃపురంలో రాజసం ఉట్టిపడుతూ, చేతిలో మందు గ్లాసుతో ఒంటరి సావిత్రి గారిని చూస్తాం. కూతురు అక్కడ ఉన్న మందు బాటిళ్లను పగలగొడుతుంటే కోపంతో సావిత్రి గారు అడ్డుకుంటారు. అనుకోకుండా అక్కడ ఉన్న కాండిల్ స్టాండ్ పడిపోతుంది. ఉన్నట్టుండి చెలరేగిన మంటల వెలుగులో కూతురిని దూరంగా నెట్టేసిన సావిత్రి గారు.. మందు సీసాని మాత్రం గుండెలకు హత్తుకుని కనిపిస్తారు. మంటల నుంచి బయటకు రాలేక కూతురు అమ్మా.. అని అరుస్తున్నా పట్టించుకోకుండా, చేతిలో మందు బాటిల్ మాత్రం వదలకుండా చూపించడం.. దాని అవసరం తనకు ఎంత ఉందో తెలిసేలా చెప్పారు. దర్శకుడిగా నాగ్ అశ్విన్ విజన్ ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి ఈ సినిమాలో ఈ ఒక్క సీన్ చాలు అని నాకు అనిపించింది.
ఆకాశ వీధిలో అందాల జాబిలి
సినిమా అవకాశాలు తగ్గడంతో వచ్చిన చిన్న చిన్న పాత్రలు చేస్తూ వెళ్లిపోతున్నా.. సినిమాల్లో తన కళ తప్పింది కానీ, వ్యక్తిత్వంలో కాదని హుందాగా ప్రవర్తించడం సావిత్రి గారికే చెల్లింది. ఉన్నప్పుడు ఎవరైనా సాయం చేస్తారమో.. కానీ ఏమీ లేనప్పుడు కూడా తన దగ్గర ఉన్నదాంట్లోనే సాయం చేయాలంటే ఎంతో పెద్ద మనసు కావాలి. దానికి మన దగ్గర డబ్బులే ఉండాల్సిన అవసరం లేదు, ఎదుటివారికి సాయపడాలనే గొప్ప మనసు ఉన్నా చాలు. అన్నీ కోల్పోయి పూట గడవడమే కష్టమైన రోజుల్లో కూడా తన చీరను అమ్మి ఆ డబ్బుతో అవసరాల్లో ఉన్నవారికి సాయపడిన బంగారం సావిత్రి గారంటే. జీవితంలో అన్ని ఆశలు చంపుకుని, తనను తాను బాధ పెట్టుకుని.. జీవితంలో ఎంతో సాధించి చివరికి ఏమీ మిగుల్చుకోక అనాథలా ఆస్పత్రిలో చేరతారు సావిత్రి గారు. దాదాపు 18 నెలలు కోమాలో ఉండి స్వర్గస్తులయ్యారు. సావిత్రి గారి జీవితం చూసి.. ఎలా చనిపోయారు అన్నది కాదు, ఎలా గొప్పగా బతికారనేది తెలుసుకోవాలి. సాయం చేసే గుండె గొప్పదై ఉంటుంది.. ఆ గుండెకి ఏదో తెలియని ఓ ధీమా ఉంటుంది.. ఆ ధైర్యమే సావిత్రి గారు.

ఆకాశ వీధిలో అందాల జాబిలి
సావిత్రి గారి నుంచి ఎలా ఉండాలో నేర్చుకున్నట్లే.. ఎలా ఉండకూడదో కూడా నేర్చుకోవచ్చు. పది మందికి పెట్టే మంచి మనసు ఉండొచ్చు.. చివరి రక్తపు బొట్టు వరకు ఇతరుల కోసం సాయం చేయొచ్చు.. కానీ, అదే సమయంలో మన గురించి కూడా ఆలోచించుకునే స్వార్థం ఖచ్చితంగా ఉండాలి. మనుషుల్ని గుడ్డిగా నమ్మే స్వభావం కూడా అంత మంచిది కాదు.. ఎంత నమ్మినా మన జాగ్రత్తలో మనం ఉండకపోతే జీవితం తలకిందులే అని చూపించిన సావిత్రి గారి జీవితం మన అందరికీ ఓ గుణపాఠం. సావిత్రి గారి జీవితాన్ని చూసి ప్రేమ, పెళ్లి విషయంలో జాగ్రత్త పడు అని చెప్పడం ఒక్కటే కాదు.. నీ కోసం నువ్వు ఎంత కూడబెట్టుకోవాలి.. డబ్బు విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలి.. పెద్ద మనసుకు పోయి అవసరానికి మించి ఎవరికీ సాయపడొద్దని చెప్పే ఆర్థిక పాఠం. ఏది ఏమైనా ఒక గొప్ప మనసున్న వ్యక్తిగా, స్త్రీ మూర్తిగా, మహానటిగా.. సావిత్రి గారు ఎప్పటికీ మన గుండెల్లో నిలిచి ఉంటారు.

ఆకాశ వీధిలో అందాల జాబిలి


సావిత్రి గారు.. ఆకాశ వీధిలో అందాల జాబిలి

ఆకాశ వీధిలో అందాల జాబిలి


'మహానటి' సినిమా అంటే మీకు ఇష్టమా..? అయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలపండి. నా ఆర్టికల్ నచ్చితే ఒక లైక్ చేయండి. Thank you


కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి