మహిళా దినోత్సవం

ఆడది.. నువ్వు పుట్టిన క్షణం నుంచి కాటికి చేరే చివరి వరకు నీకు అన్ని విషయాల్లో తోడుగా ఉండే బలం. అమ్మగా, చెల్లిగా, భార్యగా ఇలా అన్ని విషయాల్లో స్త్రీమూర్తి నీ జీవితంలో నీకు అండగా ఉండి నడిపిస్తుంది. ఆ ఆడదే లేకపోతే అసలు నీకు జన్మే లేదు. అవును నిజమే, ఇదంతా మాటల్లోనే చెప్పుకుంటున్నాం.. కానీ, నిజ జీవితంలో మనలో ఎంత మంది ఆడవాళ్లకి సరైన గౌరవం ఇస్తున్నాం. ఆలోచించండి..!! మార్చి 8న ఎప్పటిలాగే మళ్లీ మహిళా దినోత్సవం వచ్చేసింది. ప్రతి ఏడాదిలాగే తెల్లారి లేవగానే వాట్సాప్ స్టేటసుల్లో 'హ్యాపీ ఉమెన్స్ డే' అని పెట్టేసి వ్యూస్ చెక్ చేసుకుంటాం.. అంతవరకేనా?
మహిళా దినోత్సవం
ప్రస్తుతం మహిళ ఎన్నో రంగాల్లో రాణిస్తుంది. అయినా ఇంకా కొన్ని చోట్ల అవమానాలు ఎదుర్కొంటూనే ఉంది. ఎప్పుడూ ఎక్కడో అక్కడ అత్యాచారాలు, మానభంగాలు జరగడం చూస్తూనే ఉన్నాం. అయ్యో పాపం అని కన్నీరు కారుస్తూనే ఉన్నాం. క్యాండిల్స్ వెలిగించి ర్యాలీలు తీస్తూనే ఉన్నాం. ఇలాంటి పరిస్థితులకు ఒక ముగింపు ఏర్పడాలి.
మహిళా దినోత్సవం
ఒక ఆడది ఎప్పుడూ ఒంటరి కాదు. స్కూల్ వయసులో ఉన్నప్పటి నుంచి తల్లి అయ్యి ఒక ఇంటిని నడిపే వరకు చుట్టూ చెడుగా చూసే ఎన్నో కళ్లు, వినిపించే పుకార్లు ఆమెకి తోడుగా ఉంటూనే ఉంటాయి. అలాంటి ఆడవాళ్లు నీ ఇంట్లో, నీ చుట్టూ, నీ పక్కనే ఉంటారు కూడా. అలాంటి మహిళల కోసం ఒకరోజు ఇస్తున్నాం.. నిజ జీవితంలోనూ అంతే విలువ ఇద్దాం. 
మహిళా దినోత్సవం
నా జీవితంలో నాకు తెలిసిన గొప్ప మహిళ అంటే మా అమ్మే. నాకే కాదు, ఈ భూమిపై పుట్టిన ప్రతి ఒక్కరికీ అంతే కదా! నవమాసాలు మోసి, కని, పెంచి, మనల్ని ఇంతవాళ్లని చేసిన అమ్మకి మించిన దైవం ఎవరు ఉంటారు చెప్పండి? మనల్ని కనడానికి పడే పురిటి నొప్పుల బాధ.. తనకి మరో జన్మ. అంతటి బాధని కూడా ధైర్యంగా స్వీకరించి, ఈ భూమి మీద పడే అవకాశాన్ని నీకు ఇచ్చినప్పుడే అమ్మకి నువ్వు రుణపడిపోయావు. మరి అలాంటి దేవతలాంటి అమ్మకి నువ్వు ఏమిచ్చి రుణం తీర్చుకుంటావు? మా అమ్మకి మాత్రం ఒకటి చెప్తా. నన్ను కన్నాక ఇన్నేళ్లలో ఏదో ఒకరోజు తెలిసో తెలియకో తన మనసు బాధపెట్టి ఉంటా. ఈ మాట తన కళ్లలోకి చూసి చెప్పే ధైర్యం నాకు లేదు. ఎందుకంటే, ఎదురుగా చెప్తే నేను బాధ పడుతున్నానని తెలిసి తను కూడా కన్నీళ్లు పెట్టుకుంటుందేమో నా పిచ్చితల్లి. అందుకే ఈ ఆర్టికల్ ద్వారా చెప్తున్నా..
క్షమించు అమ్మా..! 
మహిళా దినోత్సవం
నీ చిన్నతనం నుంచి వంటింటికే పరిమితమై నీకు అన్నీ చేసి పెట్టిన అమ్మకి ఒక్కరోజు నువ్వు అమ్మవై కమ్మగా వండిపెట్టు.. కుదిరితే నీ చేతితో తినిపించు. చిన్నప్పటి నుంచి కలిసి పెరిగి, దెబ్బలాడుకున్న మీ అక్క లేదా చెల్లికి ఇంట్లో అయినా నిజంగా పూర్తి స్వేచ్ఛ ఉందా అని అడిగి తన మనసులో మాట తెలుసుకో. కట్టుకున్న భార్య నీకు రోజులో అన్నీ చేసి పెట్టి, రాత్రయితే నీకు సుఖం అందిస్తుంది కదా..! మరి వాళ్లకు ఒక్కరోజైనా చెప్పావా? నీకు నచ్చినట్లుగా ఉండు, నీకు నేనున్నా అని. ఒక్కసారి చెప్పి చూడు... ప్రపంచాన్నే గెలిచిన ఆనందం వాళ్ల కళ్లల్లో చూస్తావు.
మహిళా దినోత్సవం
వాట్సాప్, ఫేస్‌బుక్‌ల్లో స్టేటసులు పెట్టడమే కాదు.. ఇంట్లో ఉన్న ఆడవాళ్లను నిజంగా గౌరవించినప్పుడే ఈ మహిళా దినోత్సవం అనేదానికి అసలైన అర్థం వస్తుంది. ఎక్కడైతే స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు సంచరిస్తుంటారని పెద్దవాళ్లు చెప్పిన మాట. అలాంటి ప్రతి స్త్రీమూర్తికి నా వందనం.
మహిళా దినోత్సవం

నా ఆర్టికల్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఇది చదివాక మీ ఇంట్లో అమ్మ గానీ, చెల్లి గానీ మీకు గుర్తొస్తే వాళ్లతో కాసేపు ప్రేమగా మాట్లాడండి. సంతోషంగా ఉంచండి. ఆడవాళ్లను గౌరవించండి. అలాంటి మీకు నచ్చిన స్త్రీమూర్తికి ఇది షేర్ చేయండి. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ ద్వారా నాకు తెలపండి.  

THANK YOU

PC: CH. VAMSHI MOHAN

కామెంట్‌లు