ఇది మన అమ్మానాన్నల కథ...!

'రంగమార్తాండ'.... చూస్తున్నంత సేపు ఏదో సినిమా చూస్తున్నా అనే ఫీలింగ్ లేదు, జీవితాన్ని చూసినట్లు అనిపించింది. ఆ రంగమార్తాండ రాఘవ రావు పాత్ర మన పక్కనే కూర్చుని తన కథ చెప్పినట్లు అనిపించింది. ఇదిరా నా కథ.. నీకు మనసనేది ఉంటే కాస్త నా కోసం కన్నీళ్లు కార్చు అని చెప్పినట్లు అనిపించింది. సినిమా చివరి వరకూ అక్కడక్కడా కళ్లల్లో తడి అలా వచ్చి వెళ్లింది.  


స్టేజీ ఎక్కితే నటనలో తనను కొట్టేవాడే లేడు అనిపించుకున్న ఓ గొప్ప కళాకారుడు.. నిజ జీవితంలో ఫెయిల్ అవ్వడం చూస్తాం ఈ సినిమాలో. ఇదీ మన అమ్మానాన్నల కథ. అవును.. ప్రతి ఇంట్లో జరిగే కథే. మనం పుట్టినప్పటి నుంచి తల్లిదండ్రులు మనపై పెట్టుకున్న ఆశలు, కన్న కలలు.. మనం ఎదుగుతూ రెక్కలు వచ్చాయని విర్రవీగి బిజీ లైఫ్ లో గడిపేస్తుంటే, మనం చూపించే కొంచెం ప్రేమ కోసం వాళ్లు పడే తపన.. చేతకాని వయసులో వాళ్లు మన నుంచి కోరుకునే కొంచెం ఆదరణ... ఇలాంటివన్నీ కళ్లకు కట్టినట్టుగా అర్థమయ్యాయి. పరుగులు పెడుతున్న ఇప్పటి ప్రపంచంలో.. స్కూళ్లల్లో తెలుగు మాట్లాడడం తప్పు అని, ఇంగ్లీష్ మాత్రమే మన భవిష్యత్తు అని అలవాటు పడిపోయిన మనల్ని వెనక్కి లాగి ఇది తప్పు అని చెంప మీద కొట్టినట్లుగా అనిపించింది. 

ఈ సినిమాలో పరిస్థితులే విలన్స్.. ఇంట్లో మన చుట్టూ జరిగే సంఘటనలే సమస్యలుగా ప్రతి ఒక్కరి జీవితం తెర మీద కనిపిస్తుంది. ఇక ప్రకాష్ రాజ్ గారు ప్రాణం పెట్టినట్లుగా ఈ పాత్రని మరొకరు చేయలేరేమో..! రమ్యకృష్ణ గారి గురించి చెప్పేదేముంది.. నిండైన కట్టు బొట్టుతో తక్కువ మాటలు మాట్లాడుతూ మహాలక్ష్మిలా ఉన్నారు. బ్రహ్మానందం గారిని ఎప్పుడూ చూడని విధంగా కొత్తగా చూస్తాం.. ఆయనలోని ఓ పరిపూర్ణ నటుడిని దర్శిస్తాం.

సినిమా అయిపోయాక మాత్రం నా గుండె బరువు ఎక్కింది.. కళ్లల్లో నీళ్లు నిండి అవి బయటికి రాలేక నా మనసు ఏడ్చేసింది.. అమ్మానాన్న గుర్తొచ్చారు.. ఒక మంచి సినిమా చూశానన్న ఫీలింగ్ తో మనసు నిండిపోయింది.

ఇది మన అమ్మానాన్నల కథ...!



కామెంట్‌లు