బాపు గారి 'పెళ్లి పుస్తకం'

ఎలాంటి సంబంధం, పరిచయం లేని ఒక స్త్రీ, ఒక పురుషుడు 'పెళ్లి' అనే బంధంతో ఒక్కటవుతారు. పెళ్లి అంటే ఇద్దరు మనుషులు కలవడమే కాదు.. రెండు మనసులు ఒక్కటవడం.  ఆ తర్వాత ఇక ఆ ఇద్దరికీ ఓ కొత్త ప్రపంచం ఎదురవుతుంది. అలాంటి ప్రపంచాన్ని అందంగా తీర్చిదిద్దుకుని, మనసులు తెలుసుకుని మసలుకుని ఒకరికి ఒకరు తోడుగా ఉండి ముందుకు సాగితే ఆ దాంపత్య జీవితం పరిపూర్ణం అవుతుంది. పెళ్లి తర్వాత అలకలు, కోపాలు, అనుమానాలు.. ఇలాంటివన్నీ చిన్న చిన్న గాలివానలే. వాటిని ధైర్యంగా ఎదుర్కొని ముందుకు వెళ్లడానికి 'నమ్మకం' అనే ఒక ఆయుధం చాలు. అలాంటి చిర్రుబుర్రులను జీవితంలో ఎలా తట్టుకోవాలో తెలియజేయడానికి వెండితెర మీద ఓ దర్శక మహానుభావుడు ఒక పుస్తకమే రాశాడు. అదే 'పెళ్లిపుస్తకం'. 

దర్శకులు బాపు గారు బొమ్మ గీస్తే ఎంత అందంగా ఉంటుంది.. మరి అదే ఆయన కదలాడే బొమ్మలు గీస్తే అవి ఇంకెంత అందంగా ఉంటాయి. మరి ఆ బొమ్మలకు మాటలు రావాలంటే..? ఆయన ప్రాణ స్నేహితుడు రమణ గారు ఉండాల్సిందే కదా..! అలా ఈ ఇద్దరూ కలిసి వెండితెర మీద చేసిన ఓ అద్భుతమే ఈ 'పెళ్లిపుస్తకం'. వివాహ వ్యవస్థ గొప్పతనం, భార్యాభర్తల మధ్య బంధం గురించి ఎన్నో సినిమాలు వచ్చినా.. బాపు, రమణల 'పెళ్లిపుస్తకం' సినిమా మాత్రం తెలుగు సినీ చరిత్రలో నిలిచిపోయింది. సంసార సాగరాన్ని ఈదాల్సిన ఇద్దరు దంపతులు తమ కష్టాలు పోగొట్టుకోవడానికి తమకు పెళ్లి కాలేదనే ఒక చిన్న అబద్దంతో ఉద్యోగాల్లో చేరుతారు. ఇక ఆ తర్వాత వచ్చే ఆటుపోట్లను ఎలా ఎదుర్కున్నారనేదే ఈ కథ. ప్రముఖ రచయిత, నటుడు రావి కొండలరావు గారు అందించిన ఈ కథ సమాజంలోని దంపతులకు ఎప్పటికీ ఒక పాఠంగా మిగిలిపోయింది.

అన్యోన్యంగా ఉన్న ఇద్దరు భార్యాభర్తల మధ్యలో ఎందరు అడ్డుగా వచ్చినా, అనుమానాలు పెంచుకుని కాపురాలు నాశనం చేసుకునే పరిస్థితులు తెచ్చుకోకూడదని, ఒకరిపై ఒకరికి నమ్మకం ఎంతో ముఖ్యమని చూపించారు. పెళ్లి అంటే స్నేహమని, ఆ స్నేహానికి పునాది నమ్మకం, గౌరవం అని చక్కటి మెసేజ్ ఇచ్చారు. విడిపోవాలనుకున్నా వీలుపడని గట్టి బంధమే పెళ్లి అని మన భారతీయ వివాహ వ్యవస్థ గొప్పదనాన్ని తెలియజేశారు. రోజురోజుకీ బంధాలకు, ప్రేమలకు అర్థం లేకుండా జీవిస్తున్న మన ప్రస్తుత జీవన విధానంలో.. ఇంకో పది తరాలు మారినా, పెళ్లి చేసుకుని కొత్త జీవితం మొదలుపెట్టే ప్రతి ఒక్కరికీ ఈ 'పెళ్లిపుస్తకం' మంచి పాఠ్యపుస్తకం.. కాదంటారా..?

బాపు గారి 'పెళ్లి పుస్తకం'





కామెంట్‌లు